శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (14:35 IST)

మీకు ఒక చీపురు, ఒక పెన్ బహుమతిగా ఇస్తా: ఆజమ్ ఖాన్

ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఒక చీపురు, ఒక పెన్ బహుమతిగా ఇవ్వడమే కాకుండా సమాజంలోని రుగ్మతలను ఎదుర్కోవడానికి ఆ రెండింటిలో ఏది అవసరమో నిర్ణయించాలని కోరుతూ ఒక లేఖ కూడా రాశారు.

‘నేను మీకు రెండు బహుమతులు ఇస్తున్నాను. ఈ రెండింటిలో ఏది సమాజంలోని పాపాలను తుడిచిపెడ్తుందో, కేవలం నినాదాలతో సమాజాన్ని బాగు చేయలేమని ఏది మీకు గుర్తు చేస్తుందో మీరు నిర్ణయించాలి' అని ఆజమ్‌ఖాన్ ఆ లేఖలో సూచించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శగానే ఆజమ్ ఖాన్ ఎమ్మెల్యేలకు ఈ బహుమతులు పంపించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
కాగా అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మోడీ ప్రజల చేతికి చీపురు ఇచ్చి వారి నుంచి కలాన్ని లాక్కున్నారంటూ విమర్శలు చేశారు. ఈ నెల 26న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పెన్, చీపురు, ఉత్తరంతో కూడిన స్ట్రోలీ బ్యాగులను ఆయన ఎమ్మెల్యేలకు పంపించారు. ‘మీరు నన్ను ఎంతో కాలంగా చూడడమే కాకుండా పరీక్షించారు కూడా. జనం అందరూ చెప్పుకునేటువంటి వ్యక్తినికాదని, భిన్నమైన వాడినని మీ మనసులకు తెలుసు. మీరంతా నిజాయితీపరులని, నిజాన్ని గ్రహిస్తారని నాకు తెలుసు' అని కూడా ఆజమ్‌ఖాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
 
అయితే ఈ బహుమతులపై బిజెపి ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ స్వచ్శ్ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రధాని సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చారని, దాన్ని ఆజమ్‌ఖాన్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.