శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ESHWAR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (15:18 IST)

రాబోయేది కాషాయి భారతమా?

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రాగానే హిందూ ఉన్మాద శక్తుల్లో కదలిక వచ్చింది. తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అవి తమ రహస్య ఎజెండా అమలుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 
 
తమ పరమత అసహనాన్ని నిస్సంకోచంగా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా దీనానాథ్ బాత్రా అనే రచయిత, బీజేపీ సిద్ధాంతకర్త ఏకంగా చరిత్రనే తిరగతోడాలని ప్రతిపాదిస్తున్నారు. చరిత్రంతా వక్రీకరణకు గురైందని, హిందువులకు తీరని అన్యాయం జరిగిందని వితండవాదం చేస్తున్నారు. 

సిలబస్‌మార్చండి - బాత్రా 
చరిత్రలో హిందువులకు ఘోరమైన అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న బాత్రా చరిత్ర మూలాలను మార్చాలంటున్నారు. పాఠశాలల్లో పిల్లలకు బోధించే సిలబస్‌నే తిరగరాయాలంటున్నారు. చరిత్ర గతినే వక్రమార్గం పట్టించేందుకు యత్నిస్తున్నారు. చరిత్ర పుస్తకాలను మార్చాలంటూ ఈ పెద్ద మనిషి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతటితో ఆగకుండా ఆయన కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీని కూడా కలిసి తన హిందూత్వ ఎజెండాను ఏకరువు పెట్టారు. పాఠ్యపుస్తకాల సిలబస్‌ మార్చాలంటూ కోరారు.
 
కలవరపెడుతున్న బాత్రా వ్యాఖ్యలు.. 
పుస్తకాలను మార్చాలంటూ బాత్రా చేస్తున్న వాదన సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో అమలువుతున్న విద్యా విధానం విదేశీ సంస్కృతిని ప్రతిబింభిస్తోందట. కార్ల్‌ మార్క్స్ మెకాలే సంతతికి చెందిన వారు ఈ పాఠ్య పుస్తకాలను రూపొందిస్తున్నారట. ఇక్కడి పాఠ్యంశాలు దేశ సంస్కృతీ సాంప్రదాయాల్లోంచి తయారైనవి కావట. ఇటువంటి వితండ వాదనలతో బాత్రా అధికార పార్టీ ఎజెండాను ముందుకు తెస్తున్నారు. చరిత్రను వక్రీకరించారంటూ వాస్తవాలను వక్రీకరించే పనిలో పడ్డారు. 
 
అధకార పార్టీ అండదండలు..
బాత్రాకు అధికార పార్టీ అండదండలున్నాయనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. గుజరాత్‌‌లోని బీజేపీ ప్రభుత్వం ఆయన రాసిన ఒక పుస్తకాన్ని ఇప్పటికే స్వీకరించింది. రాష్ట్రంలోని 42 వేల ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. మహారాణా ప్రతాప్ గురించి రెండు వాక్యాలు ఉన్న పాఠ్యపుస్తకాల్లో మొఘలు చక్రవర్తి అక్బర్‌ గురించి రెండు పేజీలు ఉటోందని ఆయన తెగ బాధపడిపోతున్నారు. ఔరంగజేబును హీరోను చేస్తారా అంటూ తన భావజాలాన్ని వెళ్ళగక్కారు. 
 
ఈ  బాత్రా ఎవరు..?
రిటైర్డ్ టీచర్‌, బీజేపీ సిద్ధాంతకర్త, స్వయం సేవక్‌ అయిన బాత్రా మొన్న ఫిబ్రవరి నుంచి వెలుగులోకి వచ్చారు. ఆయన హిస్టారియన్‌, ప్రముఖ రచయిత వెండీ డోనిజెర్స్‌ రాసిన 'ద హిందూస్‌-యన్‌ ఆల్టర్‌నేటివ్ హిస్టరీ' అన్న పుస్తకంపై కేసు వేసి గుర్తింపు పొందారు. ఆయన వేసిన దావాతో ఈ గ్రంథం ప్రచురణ కర్తలైన పెంగ్విన్‌ ఇండియా ఈ పుస్తకాలన్నింటినీ వెనక్కుతీసుకోవాల్సి వచ్చింది. పుస్తకాలను నాశనం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిర్గతంగా ఆర్థిక సంస్కరణలను, అంతర్గతంగా మత సంస్కరణలను ఆమలు చేస్తోందా ఆన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.