గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:18 IST)

బీహార్ పోల్ : 242 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన మహాకూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్‌ పార్టీల నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి బుధవారం 243 స్థానాలకుగాను 242 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ, ఆర్జేడీలకు చెరి 101 స్థానాలు, కాంగ్రెస్‌కు 41 స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. 
 
బీహార్ రాజధాని పాట్నాలో జేడీయూ చీఫ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. జేడీయూ పోటీ చేయాల్సిన రాజ్‌గిర్‌ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. లౌకికకూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా నితీష్‌ మీడియా మిత్రులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించినట్లు చెప్పారు. ఈ అభ్యర్థుల జాబితాలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారులు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ల పేర్లు ఉన్నాయి. తేజ్‌ప్రతాప్‌ మహువా నుంచి, తేజస్వి యాదవ్‌ రాఘోపుర నుంచి పోటీ చేయనున్నారు. అక్టోబరు 12న జరిగే మొదటి దశ పోలింగ్‌కు నామినేషన్‌ వేయడానికి బుధవారం ఆఖరి తేదీ. అక్టోబరు 12 నుంచి నవంబరు 5 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ నిర్వహంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెల్సిందే.