బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (20:39 IST)

నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారు : నరేంద్ర మోడీ

నా అభిమానులు మాత్రమే కాదు.. నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భాగల్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఇటీవల పాట్నాలో జరిగిన లాలూ, నితీశ్, సోనియాల ర్యాలీలో తన పేరు వల్లెవేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 
 
రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ల ఆదర్శాలను లాలూ, నితీశ్ ఎప్పుడో వదిలేశారని మోడీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జయప్రకాశ్ నారాయణ్‌ను జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నవారు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలు తెలివైన వారని, అభివృద్ధి రాజకీయాలు చేసే పార్టీలకే పట్టం కడతారన్న నమ్మకం ఉందన్నారు. 
 
అలాగే, కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాభివృద్ధి కోసం రూ.3.76 లక్షల కోట్లు ఇచ్చిందని, వాటిలో రూ.2.70 లక్షల కోట్లకు మాత్రమే లెక్కలున్నాయని, మిగిలిన రూ.1.06 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఎవరు మేశారు? వీటికి లెక్కలు చూపించగలరా? అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, 'భాగల్పూర్ నుంచి నేను సవాల్ విసురుతున్నా. నా పదవీకాలం ముగిసేలోగా ఐదేళ్లలో ఏయే పనికి ఎంతెంత ఖర్చు చేశామో పైసా సహా లెక్క చూపుతాం. అదే పనిని ప్రస్తుత బీహార్ ప్రభుత్వం చెయ్యగలదా?... కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద మొత్తానికి ఇక్కడి పాలకులు లెక్కలు చూపడంలేదు. అంటే ఏమిటి అర్థం? ఆ డబ్బు ఎవరు మేశారు?' అని ప్రధానమంత్రి మోడీ నిలదీశారు.