శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (17:06 IST)

ఢిల్లీలో పోటాపోటీ... నువ్వా నేనా అంటున్న ఆప్, బీజీపీ

ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. బరిలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ పోటీ మాత్రం రెండు పార్టీల నడుమ రసవత్తరంగా నడుస్తోంది. ఇటు భారతీయ జనతా పార్టీ సయ్... అని ఎన్నికల రంగంలోకి దిగితే ఆమ్ ఆద్మీ పార్టీ అంతుకు రెండు రెట్లతో నినాదాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నా, తీవ్ర పోటీ మాత్రం ఈ రెండు పార్టీల నడుమే కనబడే అవకాశాలున్నాయి. గత ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు బీజేపీ కమల తీర్థం ఇస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ పార్టీ నడుమ నెలకొన్న పోటీపై రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్నారు. విశ్లేషకులు .
 
తాజాగా వెల్లడైన సీ- ఓటరు సర్వే ప్రకారం ఢిల్లీ లో 70 స్థానాలుండగా రెండు ప్రధాన పెద్ద పార్టీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు నిలువనున్నాయి. 34 నుంచి 39 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకోగలదనే అంచనా వేస్తున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మాజిక్ నంబరుకి అటు ఇటుగా నిలుస్తోందన్న మాట. భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు 29 నుంచి 34 సీట్లను సాధించగలదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తోంది. అందున కేవలం సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడనుంది. 
 
రాజకీయ విశ్లేషకులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని అంత తక్కువగా అంచనా వేయడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతలను భారతీయ జనతా పార్టీ ఆకర్షించేస్తోంది. అయినా సరే ఓటరులు మాత్రం ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్న సమయంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ తన సత్తా చాటింది. అలాంటిది తలకాయలాంటి ఢిల్లీలో ఆప్ గెలిచిందంటే.. నరేంద్ర మోదీ జనాకర్షణ మసకబారిందనే అర్థం గోచరిస్తుంది.