శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2014 (10:54 IST)

మహారాష్ట్రలో శివసేనతో పొత్తు వద్దు.. బీజేపీ కార్యకర్తల మనోభావం!

కేవలం మూడంటే మూడు సీట్ల కోసం పట్టుబట్టి 25 యేళ్ల సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న శివసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయరాదంటూ మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తలు చెపుతున్నారు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో, ఇపుడు కేబినెట్ బెర్తుల పంపకాల్లో శివసేన మొండిగా వ్యవహరిస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తోందని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పైపెచ్చు మహారాష్ట్ర సీఎం పోస్టును తమకే ఇవ్వాలని కూడా శివసేన ఒకానొక దశలో పట్టుబట్టిన వైనాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో మొండిగా వ్యవహరించి, పార్టీ ఒంటరిపోరుకు కారణమైన శివసేనతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కార్యకర్తల మనసొప్పడం లేదట. 
 
ఒంటరిగానే బరిలోకి దిగి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తమ నేతాశ్రీలకు నూరిపోస్తున్నారట. మద్దతు కోసం శివసేన చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన ఖర్మ తమకేమీ పట్టలేదని, ఎలాగూ అడగకముందే మద్దతు ప్రకటించిన ఎన్సీపీ బయటి నుంచే సహకరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు.