శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 17 ఆగస్టు 2014 (11:40 IST)

అమిత్ షా జట్టులో ఆర్ఎస్ఎస్ నేతలకు పెద్దపీట!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన కొత్త కార్యవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు అధిక ప్రాధాన్యం లభించింది. గతంలో ఏ బీజేపీ అధ్యక్షుడి జట్టులో లేనంత మంది ఆరెస్సెస్ నేతలకు అమిత్ షా జట్టులో స్థానం కల్పించడం గమనార్హం. గత నెలలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తన కొత్త జట్టును శనివారం ప్రకటించారు. ఈ జట్టులో 11 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. 
 
ఇందులో ఆరెస్సెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన రామ్ మాధవ్ కు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. రామ్ మాధవ్‌కు బీజేపీ కీలక బాధ్యతలు కట్టబెట్టనుందనే ఊహాగానాలు కూడా సాగిన సంగతి తెలిసిందే. రామ్ మాధవ్ తో పాటు ఆరెస్సెస్ నేపథ్యంతో బీజేపీలో చేరిన జగత్ ప్రకాశ్ నద్దా, రామ్ లాల్, మురళీధరరావులకు కూడా ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కాయి. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, తెలంగాణ ప్రాంత బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష్య పదవులు దక్కాయి. వీరిలో యడ్యూరప్ప ఆర్ఎస్ఎస్ మాజీ నేత కావడం గమనార్హం.