శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (14:49 IST)

గోమాత కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధం: సాక్షి మహారాజ్

గోమాత అయిన ఆవును కాపాడుకునేందుకు తాము ఎవరినైనా చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని బీజేపీ ఎంపీ సాత్రి మహారాజ్ ప్రకటించారు. గోమాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము వూరుకోమని స్పష్టం చేశారు.

ఆవు మాంసం భుజించాడనే ఆరోపణలతో యూపీలో ఓ ముస్లిం వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన వివాదాస్పదమైన నేపథ్యంలో సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. అలాగే పనిలో పనిగా సాక్షి మహారాజ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అజం ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన వాడని, మరణించిన వ్యక్తి కుటుంబానికి యూపీ సీఎం ఆర్థిక సాయం ప్రకటించడంపై సాక్షి మహారాజ్ తప్పుబట్టారు. 
 
ఇదిలా ఉంటే.. నిషేధిత జంతు మాంసం తీసుకున్నాడనే అనుమానంతోనే మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తి చనిపోవడానికి కారణమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. యూపీలోని దాద్రీకి దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన అక్లఖ్‌ను పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసింది. అయితే నివేదికలో ఎక్కడా 'బీఫ్' అనే పదం వాడలేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే.