బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:06 IST)

అగస్టా దోషులెవరో తేలాల్సిందే.. సోనియాకు లింకుందా?: హోంమంత్రి రాజ్‌నాథ్‌

దేశాన్ని ఓ కుదుపు కుదుపుతున్న అగస్టా కుంభకోణంలో ముడుపులు తీసుకున్న వారి పేర్లు బహిర్గతం కావాల్సిందేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని, ఈ కేసులో ముడుపులు తీసుకున్న వారి పేర్లు వెలుగులోకి వస్తే అసలు దోషులు ఎవరో తేలుతారన్నారు. 
 
మరోవైపు ఈ కేసులో దోషులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 జూలై 3న ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సహా హెలికాప్టర్ల కుంభకోణంతో ముడిపడిన ఆరు కంపెనీలను బ్లాక్‌లిస్టులో ఉంచినట్టు రక్షణ శాఖ తెలిపింది. 
 
వీటిపై సీబీఐ కేసు కూడా నమోదు చేసిందని గుర్తు చేసింది. యూపీఏ హయాంలో ఆగస్టాతో ఒప్పందాన్ని మాత్రమే రద్దు చేశారని, ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో ఉంచామని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో దళారులుగా వ్యవహరించిన కార్లో గెరోసా, గైడో హష్‌కే రాల్ఫ్‌, క్రిస్టియన్‌ మైఖెల్‌ను దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.