శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (04:15 IST)

జవాన్ తాగుబోతే కావచ్చు. ఆర్మీలో అవినీతి మాటేమిటి?

సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని సాక్ష్యాధారాలతో సహా వీడియోకెక్కించి ఫేస్‌బుక్‌లో ప్రచురించిన బీఎస్ఎఫ్ జవాన్‌ని నేరారోపణలతో బలి తీసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయిందా.. అంటే సమాధానం అవును అనిపిస్తోంది.

సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని సాక్ష్యాధారాలతో సహా వీడియోకెక్కించి ఫేస్‌బుక్‌లో ప్రచురించిన బీఎస్ఎఫ్ జవాన్‌ని నేరారోపణలతో బలి తీసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయిందా.. అంటే సమాధానం అవును అనిపిస్తోంది. సైనిక బలగాల నిర్వహణలో సాగుతున్న అద్వాన పరిస్థితులపై ఈ వీడీయో పుణ్యమా అని ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలు చెలరేగుతున్న నేపథ్యంలో భారతీయ సైనిక విభాగమైన సరిహద్దు భద్రతా బలగం స్వచర్మ రక్షణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్మీలోని అవకతవకలను నిర్భయంగా బయటపెట్టిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా మారాడు. కానీ అతడి సర్వీసు రికార్డులోని తప్పులు ఆధారంగా ప్రస్తుత సందర్భంలో యాదవ్ వ్యక్తిత్వ హనన చర్యలకు పాల్పడటం ద్వారా మన సైన్యాధికారులు అవాంఛనీయ పరిణామాలకు దారి తీయడం విషాదకరం. 
 
బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం యాదవ్ తన సైనిక జీవితంలో తప్పు మీద తప్పు చేస్తూ పోయాడని తెలుస్తోంది. తనలోని క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను 2010లో అతడిపై కోర్ట్ మార్షల్ విధించారు. అతడు చేసిన నేరం ఏమిటంటే సీనియర్ అధికారిపై తన తుపాకి గురిపెట్టడమే. తన భార్యా పిల్లలను దృష్టిలో ఉంచుకుని తనపై తీవ్ర చర్యలు తీసుకోలేదని, సైన్యం నుంచి పంపించివేయలేదని ఇప్పుడు సైన్యాధికారులు అతడి పాత నేరాల గుట్టను తవ్వి తీస్తన్నారు. పైగా జవాన్లకు తాము సరఫరా చేస్తున్న ఆహారం మంచి నాణ్యత కలిగినదేననీ, కానీ చలికాలంలో ఆహారాన్ని డబ్బాల్లో పెట్టి ఎండబెట్టి ఇవ్వడం వల్ల తినేటప్పుడు అంత రుచిగా ఉండకపోవచ్చని బీఎస్ఎప్ అధికారులు సమర్థనలకు దిగుతున్నారు. 
 
కాని అసలు విషయం ఏమిటంటే ఆ జవాను తన తప్పులను అంగీకరించడమే. మనిషి తప్పులు చేయడం సహజం కాబట్టి తాను గతంలో తప్పులు చేయలేదని చెప్పబోనని, కానీ అన్ని తప్పులు చేసిన తర్వాత కూడా తనలోని అంకితభావం, కష్టించేతత్వం చూసే తనకు 16 సార్లు అవార్డులు కూడా ఇచ్చారని యాదవ్ అంటున్నాడు. 
 
యాదవ్ గత తప్పిదాల రికార్డును మాతృ సంస్థే విమర్శించడం సరైందే కావచ్చు. కానీ వారు అతడి తప్పిదాలను ఎత్తి చూపుతున్న సమయం సందర్భోచితంగా లేదు. గడ్డకట్టించే అతి శీతల వాతావరణంలో మన సైనికులు సరిహద్దులను కాపలా కాసే క్రమంలో వారు పడే భాధలను ఎవరైనా అర్థం చేసుకోవలసిందే. అనేక గంటలపాటు డ్యూటీ చేసిన తర్వాత సైనికులు కాస్త మంచి భోజనం దొరికితే చాలని అనుకోవడంలో న్యాయం ఉంది. మనం వారి పట్ల చూపించాల్సిన కనీన ఆపేక్ష ఏమంటే మంచి ఆహారాన్ని వారికి అందించడమే. 
 
యాదవ్ చేసిన ఆరోపణలు ఏ వ్యవస్థలో అయినా క్రమశిక్షణా ఉల్లంఘనకు నిదర్శనాలే కావచ్చు. కానీ అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి ముందు ఒక జవాను అన్నివేళలో తన గతాన్ని, భవిష్యత్తును ఆలోచించుకుని ఆ తర్వాతే ముందడుగు వేయాలా? ఒక వ్యక్తిగా తప్పులను బయటపెట్టే హక్కు యాదవ్‌కి ఉంది. పై అధికారులు అతడిుపై ఆగ్రహించడానికి సరైన కారణాలే ఉండవచ్చు. కానీ సైనికులు ఎక్కడ నియమితులైనా సరే. వారి సంక్షేమం విషయంలో జరుగుతున్న లోపాల పట్ల అధికారుల ఆగ్రహం మళ్లినప్పుడే యాదవ్ ఎత్తిచూపిన సమస్యలు భవిష్యత్తులోనైనా పరిష్కారానికి నోచుకుంటాయి. కానీ ఇప్పుడు దీనికి రివర్స్‌గానే పరిణామాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. భారత సైన్యం అంకితభావానికి, త్యాగస్ఫూర్తికి ఇది ప్రమాదకర పరిణామం.
 
సరిహద్దుల్లో కావలి కాస్తున్న మన సైనికుల సంక్షేమమే ప్రభుత్వ పరమావధిగా ఉండాలి. తప్పుకు వ్యతిరేకంగా మాట్లాడే వారి హక్కును సైన్యంలో కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. యాదవ్ చేసిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడం సంతోషించదగినదే. కానీ తప్పులను ఎత్తిచూపే హక్కే లేదన్నట్లుగా యాదవ్ సర్వీసు రికార్డులో తప్పిదాలను సాకుగా చూపి అసలు విషయాన్ని మరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్న సీనియర్ అధికారులపై గట్టి చర్య తీసుకోవడం ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరి విధి. 
 
తప్పును మరొక తప్పుతో సరిచేయడం, సమర్థించడం, ప్రత్యారోపణలు చేయడం ఏ రంగంలో అయినా క్రమశిక్షణను నిలబెట్టే చర్య కాదు. అది సైన్యం విశిష్టతను కాపాడే చర్య అంతకంటే కాదు.