శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (08:55 IST)

ఉప ఎన్నికల ఫలితాలు.. నరేంద్ర మోడీ దూకుడుకు ముకుతాడు!

దేశ వ్యాప్తంగా మంగళవారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూకుడుకు ముకుతాడు వేశాయి. పది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు ఫలితాలు లభించాయి. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో ఊహించని విజయం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పరిపాలనకు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కాకపోయినప్పటికీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు రావడం గమనార్హం. వచ్చే నెల మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. 
 
గుజరాత్‌లో 9 మంది, రాజస్థాన్‌లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ, తమ స్థానాలను తిరిగి చేజిక్కించుకోవడంలో అధికార బీజేపీ విఫలమైంది. వాస్తవానికి ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. కానీ, వందరోజుల్లోనే పరిస్థితిలో మార్పు వచ్చింది. 
 
ఉదాహరణకు గుజరాత్‌లో 9 అసెంబ్లీ స్థానాలకుగాను ఆరు స్థానాల్లో గెలుపొంది, మూడుచోట్ల ఓటమి చవిచూడగా.. రాజస్థాన్‌లో ఏకంగా మూడు కోల్పోయి ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఇక.. యూపీలో మిత్రపక్షం అప్నాదళ్‌ సీటు సహా 11 సిట్టింగ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడింటిని మాత్రమే కైవసం చేసుకోగలిగింది.