గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (15:55 IST)

ఏపీకి రూ.22 వేల కోట్లు: 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు... అరుణ్ జైట్లీ వెల్లడి!

ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆయన మంగళవారం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు, గ్రాంట్లను 14వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది.
 
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంసెక్షన్‌ 46 ప్రకారం కేంద్ర, రాష్ట్రంలోని నిధులు ఆర్థిక మంత్రుల అనుసారంగా రాష్ట్రానికి నిధులు, గ్రాంట్లు సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇటీవల తెలంగాణ, ఏపీలో ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక, ఆర్థిక పురోగతికి సంబంధించి ద్రవ్యప్రోత్సాహకాలు భారీగా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
 
ఇప్పటివరకు ఆర్థిక సంఘం ద్వారా 13 వేల కోట్లు రాష్ట్రానికి వస్తూనే ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకమైన ప్రోత్సహకాలు ఇవ్వాలంటూ విభజన చట్టంలో పేర్కొన్న తరుణంలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ముఖ్యంగా ఏపీకి భారీగా నిధులు, గ్రాంట్లను అందజేయాలని సిఫార్సు చేసింది. 
 
అలాగే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని సూచన చేసింది. అంతేకాకుండా, మరో 4 నుంచి 5 శాతం వాటాను స్థానిక సంస్థల ద్వారా ఇవ్వాలని ఆర్థిక సంఘం పేర్కొన్నట్టు ఆయన వివరించారు.