గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (08:57 IST)

కరెన్సీ నోట్లపై ఆంక్షలు.. జనవరి నుంచి ప్రతి లావాదేవీపైనా పన్ను.. షాకివ్వనున్న నరేంద్ర మోడీ

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో షాకివ్వనున్నారు. ఇప్పటికే నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో షాకివ్వనున్నారు. ఇప్పటికే నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా చిల్లర కష్టాలు ఆరంభమయ్యాయి. ఈ కష్టాలు ఇంతటితో ఆగిపోవని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఈ తదుపరి చర్యల్లో భాగంగానే జనవరి 1 నుంచి బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం (పెద్దనోట్ల రద్దుకు ముందు) మన ఖాతాలో ఉన్న సొమ్ముపై పూర్తి హక్కు మనదే. బ్యాంకుకు వెళ్లి మొత్తం సొమ్మును ఒకేసారి విత్ డ్రా చేసుకునే హక్కు ఉంది. ఇకముందు... దీనిపై గరిష్ట పరిమితి విధించనున్నట్టు సమాచారం. 
 
సేవింగ్స్‌ ఖాతాల్లోంచి రోజుకు 50 వేల రూపాయలు, కరెంట్‌ అకౌంట్‌ నుంచి రోజుకు లక్ష రూపాయల కంటే మించి విత్‌ డ్రా చేసుకేనే అవకాశం లేకుండా కట్టడి చేయనున్నట్లు సమాచారం. ఇంతటితో సరిపెట్టకుండా బ్యాంకు లావాదేవీలపై పన్ను (బ్యాంక్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌) విధించాలన్న ప్రతిపాదనకు మోడీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఖాతాదారులు బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసిన ప్రతిసారీ కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
అదేసమయంలో మీ సొమ్మును మీ వద్ద దాచుకున్నా తిప్పలు తప్పవు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద గరిష్టంగా ఉంచుకునే నగదు పరిమితిపైనా ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ పరిమితి కనీసం 3 నుంచి 5 లక్షల వరకు ఉండే అవకాశముంది. అంటే... ఏం చేసినా బ్యాంకుల ద్వారా, బ్యాంకుల చేత జరగాల్సిందే. చెక్కులు, డీడీలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను ఆశ్రయించాల్సిందే. రద్దైన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 30తో గడువు ముగియనుంది. ఆ వెంటనే నరేంద్ర మోడీ సర్కారు 'కట్టడి'ని మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అవినీతి నిర్మూలన కోసం ప్రధాని మోడీ చేపట్టిన చర్యలు మున్ముందు మరిన్ని కష్టాలు కలిగించే అవకాశం లేకపోలేదు.