శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (15:50 IST)

శాడిస్ట్ టెక్కీని అరెస్టు చేసిన చెన్నై పోలీసులు... వరంగల్ జిల్లా వాసి

తొమ్మిదేళ్ళ బాలికతో పాటు.. భార్యను మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో బంధించిన కేసులో శాడిస్ట్ సాఫ్ట్‌వేర్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు ప్రాంతమైన పెరుంగళత్తూరులోని తన అపార్ట్‌మెంట్‌లోని టాయ్‌లెట్‌లో తొమ్మిదేళ్ల బాలికను, భార్య ప్రియాంక (32)ను నిర్బంధించిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు.. టెక్కీ రామేశ్వర్‌ను అరెస్టు చేశారు. అతనిని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వాసిగా గుర్తించారు. 
 
వరంగల్‌కు చెందిన ప్రియాంకకు 2004లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రామేశ్వర్‌తో పెళ్లయింది. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లకు ప్రియాంక గర్భవతి కాగానే, స్కాన్ చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రియాంక అందుకు ఒప్పుకోలేదు. విడాకుల కోసం ప్రయత్నించి ఫ్యామిలీ కౌన్సిలర్ల జోక్యంతో వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో ప్రియాంక ఒక అమ్మాయికి కూడా జన్మనిచ్చింది. ఇప్పుడైనా కష్టాలు తగ్గుతాయని ఆమె భావించింది కానీ, పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయాయి. 
 
చెన్నైలోని పెరుంగుళత్తూర్ ప్రాంతంలో రామేశ్వర్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ప్రియాంక, ఆమె కూతురులను బందీలు పెట్టాడు. బయటివారితోను, ప్రియాంక తల్లిదండ్రులతోను సంబంధాలు లేకుండా చేశారు. కూతురిని టాయ్‌లెట్‌కు పరిమితం చేసి, రోజుకు రెండు ఇడ్లీలు మాత్రం పెట్టేవాడు. 
 
అతికష్టం మీద పొరుగువారి ద్వారా తాంబరం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌కు ప్రియాంక ఫోన్ చేసింది. ఈ భూతగృహం నుంచి బయటపడింది. బయట పడడమే ఆలస్యంగా ఆమె నేరుగా వరంగల్‌లోని అమ్మగారింటికి చేరింది. వారి ద్వారా టెక్కీ బండారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.