గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (09:17 IST)

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎం.డి.సి)పై దాడి చేసి భారీగా ఆస్తి నష్టం కలిగించారు. ఆదివారం అర్థరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మావోలు ఈ దాడికి తెగబడ్డారు. బచేలి పోలీసుస్టేషను పరిధిలో ఎన్‌ఎండీసీ ఉంది. ఈ ప్లాంట్‌పై దాడి చేసిన మావోలు... మూడు షావెల్స్‌, డ్రిల్‌ మిషన్‌, మోటారు పంపులను దహనం చేశారు. ఈ సంఘటనలో వంద కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 
 
దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ పరిస్థితి భయానకరంగా ఉంది. ఈ కాల్పుల కారణంగా ఎన్.ఎం.డి.సిలో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కాల్పుల్లో ప్రాణనష్టమేదీ సంభవించలేదు.