గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (09:14 IST)

అమ్మ (సీఎం జయలలిత)ను పేరు పెట్టి పిలవకూడదు.. అంతే.. ఇది నా ఆదేశం : తమిళనాడు అసెంబ్లీ స్పీకర్

తమిళనాడు ముఖ్యమంత్రి (జయలలిత)ని పేరు పెట్టి పిలవకూడదని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ధనపాల్ విపక్ష సభ్యులను ఆదేశించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి (జయలలిత)ని పేరు పెట్టి పిలవకూడదని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ధనపాల్ విపక్ష సభ్యులను ఆదేశించారు. దీనికి నిరసనగా సభలో అతిపెద్ద విపక్ష పార్టీగా ఉన్న డీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. అసలు ఈ రచ్చ ఎందుకు జరిగిందో ఓ సారి పరిశీలిస్తే...
 
ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో భాగంగా అన్నాడీఎంకే సభ్యుడు నరసింహన్ మాట్లాడుతూ, డీఎంకే అధినేతను 'కరుణానిధి' అని ప్రస్తావించగానే డీఎంకే సభ్యులంతా మూకుమ్మడిగా లేచి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఇలా పేరు పెట్టి ఎలా పిలుస్తారా అంటూ డీఎంకే సభాపక్ష ఉపనేత దురైమురుగన్‌... స్పీకర్‌ ధనపాల్‌ను నిలదీశారు. దీనికి స్పీకర్‌ స్పందిస్తూ 'సభలోని డీఎంకే సభ్యుని పేరును గౌరవసూచకంగానే అధికారపక్ష సభ్యులు సంబోధించారు' అని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
 
దీనికి డీఎంకే సభ్యులు శాంతించలేదు కదా.. తాము కూడా ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలిస్తే మీరు ఊరుకుంటారా? అని నిలదీశారు. దీనికి స్పీకర్‌ ధనపాల్ జోక్యం చేసుకుని 'శాసనసభ్యుడి పేరును గౌరవసూచకంతో సంబోధించవచ్చు. కానీ, ముఖ్యమంత్రిని మాత్రం పేరు పెట్టి సంబోధించకూడదు. ఇది నా ఆదేశం' అని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.