గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (16:43 IST)

సుపరిపాలనే ప్రధాన ధ్యేయం.. మూఫ్తీ స్పష్టం..!

దేశంలో తొలిసారిగా పీడీపీ - బీజేపీ కూటమిలో జమ్మూకాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మొహ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మొదటి సారిగా మీడియాతో మాట్లాడుతూ.. సుపరిపాలన అందించడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో ఆర్టికల్ 370పై ప్రస్తుత స్థితినే కొనసాగిస్తామని తెలిపారు. బీజేపీతో పీడీపీ పొత్తు కీలక ఘట్టమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గతం కంటే భవిష్యత్తుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్‌కు ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్‌వీ వోహ్ర చేతుల మీదుగా ముఫ్తీకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో ముఫ్తీతో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పార్టీకి చెందిన నేత నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ యూనివర్సిటీలోని జనరల్ జోర్వార్ సింగ్ ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.