గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 జులై 2015 (14:25 IST)

నావల్ల విమానం ఆలస్యం కాలేదు... కేసు పెడతా... ఔనౌను, ఫడ్నవిస్ తప్పేం లేదు...

తన కారణంగా ముంబైలో ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైందంటూ మీడియాలో వార్తలు రావడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఫైర్ అయ్యారు. ఈ తప్పుడు ప్రచారానికి బాధ్యులైన వారిపై కేసు పెడతానని ట్విట్టర్లో హెచ్చరించారు. తనవల్ల విమానం ఆలస్యం కాలేదని ఆయన వెల్లడించారు.


ఆయన ట్వీట్ చేయగానే అదే విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు ఆయనకు మద్దతుగా ట్వీట్స్ పోస్ట్ చేశారు. దుష్యంత్ అనే ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో పేర్కొంటూ... దేవేంద్ర ఫడ్నవిస్, ఆయనకు సంబంధించిన సిబ్బంది నిర్ణీత సమయానికే ఏఐ 191 ఫ్లైట్ కు చేరుకున్నారు. కరెక్ట్ టైముకు వారు రావడాన్ని నేను గమనించాను అని పోస్ట్ చేశారు. 
 
అరవింద్ షా అనే మరో ప్రయాణికుడు ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. '' నేను ముఖ్యమంత్రిగారి సీటుకు వెనుక సీటులోనే కూర్చుని ప్రయాణించాను. ఆయన విమానాన్ని ఆపమని కానీ, లేదంటే మరో రకమైన సంకేతాలను ఏవీ ఇవ్వలేదు. ఏదో ఫైలును చూసుకుంటూ చాలా బిజీగా కనిపించారు" అని పేర్కొన్నారు. 
 
కాగా అమెరికాలో కొన్ని ఒప్పందాలకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ జూన్ 29న ముంబై నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా విమానం సుమారు గంటపాటు ఆలస్యంగా వెళ్లింది. దీనికి కారణం ఫడ్నవిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాలం తీరిన వీసాను తీసుకురావడం వల్లనేననీ, ఆ తర్వాత సరియైన వీసా తెచ్చేసరికి ఆలస్యమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజంగా కాదని ఫడ్నవిస్ కొట్టిపారేస్తున్నారు. తను ముంబైకి తిరిగి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.