శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (10:43 IST)

బొగ్గు స్కామ్: నాటి బొగ్గు మంత్రి మన్మోహన్‌ను ప్రశ్నించలేదా?

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాల దర్యాప్తులో భాగంగా నాటి బొగ్గు మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తూ వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించాలని తోచలేదా అని సీబీఐను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిలదీసింది. దీంతో బొగ్గు స్కామ్ అనూహ్యమైన మలుపు తిరిగింది. ఇది సీబీఐకు షాక్ కొట్టినట్టయింది. 
 
నిజానికి బొగ్గు కుంభకోణం కేసును మూసేసి... చేతులు దులుపుకుందామని సీబీఐ భావించింది. అయితే, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఝులక్‌తో సీబీఐ దోషిలా నిలబడాల్సి వచ్చింది. వివాదాస్పదమైన బొగ్గు క్షేత్రాల కేటాయింపు సమయంలో బొగ్గు శాఖ కూడా మన్మోహన్‌ సింగ్‌ వద్దే ఉంది. ఈ కేసు మూసివేతకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన నివేదికపై మంగళవారం నిర్ణయం వెలువరించాల్సిన న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ సీబీఐకి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. 
 
‘ఈ విషయంలో అప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రి (మన్మోహన్‌)ని ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? ఆయన వాంగ్మూలం తీసుకోవాలనుకోలేదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే.. నాటి ప్రధాని మన్మోహన్‌ను ప్రశ్నించేందుకు తమకు అనుమతి లభించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. అదేసమయంలో పీఎంఓ అధికారులను ఆరా తీసినట్టు చెప్పారు.