శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (16:03 IST)

ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రతకు 8 మంది మృతి : తెలుగు రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీలు

ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. అలాగే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో చలి గుప్పిట్లో ఈ రెండు రాష్ట్రాలు చిక్కుకున్నాయి. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రతకు ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారు. 
 
అంతేకాకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు కారణంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. చండీగఢ్ నుంచి ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు శనివారం రాత్రి మరింత తగ్గాయి. ఏపీలోని విశాఖ మన్యం చలి తీవ్రతతో ముసుగేసింది. అత్యల్ప ఉష్ణోగ్రతలకు నెలవైన లంబసింగిలో 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలోని మోదకొండమ్మ పాదాల ప్రాంతం వద్ద అత్యల్పంగా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో శనివారం రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇక హైదరాబాదులోనూ శనివారం రాత్రి ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్ కు తగ్గడంతో నగరవాసులు వణికిపోయారు. రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాంతాల్లోనూ శనివారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.