మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (19:15 IST)

సామాజిక సైట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల డీల్స్ ఏంటో ..?: ఢిల్లీ హైకోర్టు

సామాజిక సైట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న ఒప్పందాలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లతో కుదుర్చుకున్న డీల్స్ ఏంటో వాటి వివరాలను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయా వెబ్ సైట్లకు ఎలాంటి మేథో హక్కులున్నాయి, వాటి కోసం ఏమైనా లైసెన్స్ కలిగి ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. 
 
కేంద్ర శాఖలు ఎలాంటి నిబంధనలు అనుసరించి ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఎకౌంట్ ఓపెన్ చేస్తున్నాయో చెప్పాలని కోరింది. పోస్ట్ చేసే సమాచారంపై మేథో హక్కులు పొందుతున్న సామాజిక మాధ్యమాలు ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదన్న సంగతి గుర్తించారా అని కోర్టు ప్రశ్నించింది. 
 
ఢిల్లీ పోలీస్, ఇండియన్ రైల్వేస్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోషల్ మీడియా సైట్లలో ఎకౌంట్లు తెరవడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేత కె.ఎన్.గోవిందాచార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దేశంలో సేవలు అందిస్తూ ఆదాయం గడిస్తున్న వెబ్ సైట్ల నుంచి పన్నులు వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఈ సందేహాలు లేవనెత్తింది. ఒప్పంద వివరాలను మరుసటి రోజే బయటపెట్టాలని కోరింది. అయితే కొంత గడువు కావాలని ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోరడంతో తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.