గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 14 జనవరి 2017 (06:15 IST)

సమస్య ఉంటే నేరుగా నాతో పంచుకోండి. మీడియా వద్దకు వెళ్లొద్దన్న ఆర్మీ చీఫ్

ఏ సైనికుడికైనా సమస్యలు ఉంటే నేరుగా నాతో పంచుకోండి తప్పితే సోషల్ మీడియాలో ప్రసారం చేయకండని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కోరారు. పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న సైనికులు వరుసగా తమ సమస్యలను సోషల్ మీడియాతో ప్రచురించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్

ఏ సైనికుడికైనా సమస్యలు ఉంటే నేరుగా నాతో పంచుకోండి తప్పితే సోషల్ మీడియాలో ప్రసారం చేయకండని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కోరారు. పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న సైనికులు వరుసగా తమ సమస్యలను సోషల్ మీడియాతో ప్రచురించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా జోలికెళ్లద్దని రావత్ సూచించడం గమనార్హం.
 
దేశంలోని సైనిక కార్యాలయాలన్నింటిలో త్వరలోనే సూచనలు, కమ్ సమస్యల బాక్స్‌లను అమర్చుతామని వాటిగుండా నేరుగా నాతోనే మీ సమస్యలు పంచుకోండని ఆర్మీ చీఫ్ చెప్పారు. 
 
సైనికులు కానీ, అధికారులు కానీ. జూనియర్ కమిషన్డ్ అధికారులు కానీ సైన్యంలో అతి ముఖ్యమైన వ్యవస్థలో భాగమై ఉన్నారు. కానీ శాంతి కాలంలో ఆచరణలో ఏం జరుగుతుందన్నది పరిశీలించవలసి ఉందని రావత్ అభిప్రాయపడ్డారు. 
 
సోషల్ మీడియా రెండంచుల పదును ఉన్న కత్తి లాంటిదని, దీనిలో సానుకూలమైన అంశం ఉన్నట్లే ప్రమాదకర ప్రభావం కలిగించే అంశాలు కూడా ఉన్నాయని రావత్ హెచ్చరించారు. భారత సైన్యం ఇప్పటికే అద్భుతమైన సమస్యా నివారణ వ్యవస్థను కలిగి ఉన్నదని దాన్ని ఇప్పుడు తన సూచనలు కమ్ సమస్యల బాక్సుల రూపంలో అమలు చేస్తామని ఆర్మీ చీఫ్ చెప్పారు.
 
తమ సమస్యలు వెల్లడించడానికి సైనికులు సోషల్ మీడియాను ఆశ్రయించడం కంటే నేరుగా అధికారులకు చెప్పుకోవాలని రావత్ సూచించారు. సైన్యంలోని సీనియర్ నాయకత్వంపై బలగాలు విశ్వాసం ఉంచాలని, మీ సమస్యలన్నింటినీ సకారణంతోటి పరిష్కరిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు చూపిన పరిష్కారం పట్ల సైనికులు అసంతృప్తి చెందినట్లయితే, వారు అప్పుడు ఇతర మార్గాలను అన్వేషించవచ్చని రావత్ సూచించారు. 
 
సైన్యాన్ని ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించిన రావత్ సైనికుల వీడియో పోస్టులు సోషల్ మీడియాలోకి వెళితే ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. తమ సమస్యల గురించి నేరుగా అధికారులతో పంచుకున్న సైనికుల వివరాలు రహస్యంగా ఉంచుతామని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా  వీలైనంతవరకు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని రావత్ హామీ ఇచ్చారు. 
 
సైన్యంలో అసంతృప్తి క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో అధికారులకు, సైనికులకు సయోధ్య కుదిర్చే ప్రయత్నాలకు ఆర్మీ చీఫ్ ప్రసంగరూపమివ్వడం విశేషం.