శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (03:38 IST)

రాహుల్ శని ఇక్కడా కొట్టిందా.. బేర్ మంటున్న ఎస్పీ నేతలు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడంతో ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమ కొంప ముంచిందని ఎస్పీ నాయకులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ పై రుసరుసలాడుతున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడంతో ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమ కొంప ముంచిందని ఎస్పీ నాయకులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ పై రుసరుసలాడుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల తమకు ఎటువంటి లాభం లేదని ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా వ్యాఖ్యానించారు. తమతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీకే లాభమని అన్నారు. సొంతంగా పోటీ చేస్తే అఖిలేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసే వారని అభిప్రాయపడ్డారు. చాలా చోట్ల ఎస్పీ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, దీంతో బీజేపీ విజయం సాధించడానికి అవకాశాలు ఏ‍ర్పడ్డాయని వివరించారు. కాంగ్రెస్‌-ఎస్పీ కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, బీఎస్పీ మూడో స్థానంలో నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
 
యూపీ పీఠాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావించిన అఖిలేశ్ కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. మరోవైపు ఒంటరిగా బరిలోకి దిగే సాహసం చేయలేకపోయిన రాహుల్ ఈ అవకాన్ని అందిపుచ్చుకుని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్, అఖిలేశ్‌లు దూసుకుపోయారు. అఖిలేశ్ అయితే ప్రధానిని ఏకంగా గాడిదతో పోల్చి తీవ్రస్థాయిలో విమర్శలు కొని తెచ్చుకున్నారు. రాహుల్ అయితే మోదీ జపం తప్ప మరొకటి చేయలేదు. మోదీ వృద్ధుడైపోయారని, ఆయనను ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. ఇలా రాహుల్, అఖిలేశ్ ఇద్దరూ బీజేపీపై సెటైర్ల మోత మోగించారు. మరోవైపు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ ఏకంగా యూపీలో తిష్టవేసి మరీ ప్రచారం చేశారు. 
 
తాజాగా వెల్లడైన వివిధ ఎగ్జిట్‌పోల్స్ బట్టి చూస్తే యూపీలో బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. 190-210 సీట్లు బీజేపీ వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్-ఎస్పీ కూటమికి 120-130 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ప్రధాని మోదీపై రాహుల్, అఖిలేశ్‌లు చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్‌లా మారి అఖిలేశ్ కొంప ముంచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఎన్నికలకు ముందు ఎస్పీలో నెలకొన్న సంక్షోభం కూడా బీజేపీ పుంజుకోవడానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.