గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (10:42 IST)

కోర్టు ఆదేశం దేవుని అభీష్టం.. నోటితో ఆహారం తీసుకోను : షర్మిల

మణిపూర్ ఐరన్ లేడీ, పౌర హక్కుల ఉద్యమకారిణి, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్‌ చాను షర్మిల బుధవారం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నిర్బంధం నుంచి విడుదలైనప్పటికీ.. తన దీక్షను మాత్రం విరమించబోనని ప్రకటించారు. మణిపూర్‌లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేసేదాకా కొనసాగిస్తానని ప్రకటించారు. 
 
జైలు ఆస్పత్రి నుంచి కన్నీరు నిండిన కళ్లతో బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఇది దేవుని అభీష్టం. నాకు చాలా ఉద్వేగంగా ఉంది. ఇన్నాళ్లుగా ఎంతో బాధపడుతున్నాను అని వణికే కంఠంతో విలేకరులతో అన్నారు. నా డిమాండ్లు నెరవేరే దాకా నా నోటితో ఎలాంటి ఆహారమూ తీసుకోను. ఇది నా హక్కు అని ప్రకటించారు. 
 
సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని అమానుషమైన చట్టంగా అభివర్ణించిన ఆమె.. ఆ చట్టం వల్ల ఎందరో మహిళలు వితంతువులయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. నిరాహార దీక్ష ద్వారా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ షర్మిలపై పోలీసులు మోపిన అభియోగాన్ని కొట్టివేసిన తూర్పు ఇంఫాల్‌ సెషన్స్‌ కోర్టు.. ఆమెను విడుదల చేయాలని మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.