శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (11:08 IST)

కడలూరు ఆలయంలో నేలమాళిగ... తపో సమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పురాతన ఆలయంలో సువిశాలమైన నేలమాళిగ వెలుగు చూసింది. అందులో తపోసమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు సైతం కనిపించాయి. జిల్లాలోని బన్రుట్టి సమీపంలోని సి.ఎన్‌.పాళెయం గ్రామంలో పురా

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పురాతన ఆలయంలో సువిశాలమైన నేలమాళిగ వెలుగు చూసింది. అందులో తపోసమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు సైతం కనిపించాయి. జిల్లాలోని బన్రుట్టి సమీపంలోని సి.ఎన్‌.పాళెయం గ్రామంలో పురాతన పుష్పగిరి మలైయాండవర్‌ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధారణ పనులు చేపట్టారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేస్తున్న సిబ్బందికి ఆదివారం ఆలయంలో ఒకచోట భూమి లోపలకు వెళ్లేందుకు మార్గం ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆ ప్రదేశంలోని అడ్డంకులు తొలగించి చూడటంతో భూగర్భ మార్గం వెలుగు చూసింది.
 
ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో ఆలయానికి వచ్చిన భక్తులు, బన్రుట్టివాసులు, జీర్ణోద్ధరణ కమిటీ నిర్వాహకులు ఆ మార్గం ద్వారా భూగర్భంలోకి వెళ్లారు. అక్కడ అద్భుతమైన నిర్మాణశైలిలో వందల చదరపు అడుగుల్లో సువిశాలమైన నేలమాళిగ దర్శనమిచ్చింది. అందులో తపోభంగిమలోని మూడు అస్తి పంజరాలు కనిపించడంతో ఎవరో సిద్ధులు జీవసమాధి పొందినట్లు భావిస్తున్నారు. తర్వాత నేలమాళిగలోకి భక్తులు, స్థానికుల ప్రవేశాన్ని నిషేధించారు.
 
ఆలయవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పురావస్తుశాఖ, శాసనాల పరిశోధకులు అక్కడకు చేరుకుని నేలమాళిగను పరిశీలించారు. ఈ నేలమాళిగను సుమారు 400, 500 సంవత్సరాల కిందట నిర్మించి ఉండవచ్చని, తపోభంగిమలోని అస్తిపంజరాలు సుమారు వందేళ్ల కిందట తపోసమాధి చెందిన ముగ్గురు సిద్ధులవై ఉండవచ్చని అంచనా వేశారు. ఇక్కడి ఆధారాలు చెదిరిపోకుండా నేలమాళిగలోకి ప్రవేశాన్ని హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు నిషేధించారు. ఈ ఆలయం, ఇక్కడ జీవించిన సిద్ధులు, నేలమాళిగ గురించి ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని శాసనాలు, తాళపత్రాలు, గ్రంథాలను పరిశీలిస్తున్నారు.