శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఓఖీ తుఫాను బీభత్సం.. ధ్వంసమైన ఇండ్లు, విరిగిపడిన చెట్లు

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఓఖీ తుఫాను.. బీభత్సం కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు లక్షదీవుల్లోనూ కొనసాగుతున్నది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఓఖీ తుఫాను.. బీభత్సం కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు లక్షదీవుల్లోనూ కొనసాగుతున్నది. శనివారం భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తుండటంతో లక్షదీవుల్లో ఇండ్లు కూలిపోగా.. కొబ్బరిచెట్లు విరిగిపోయాయి.. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో మినికాయ్ దీవిలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, లక్షదీవుల్లోని వాయవ్య ప్రాంతాలపై మరో 24గంటలు, ఈశాన్య ప్రాంతాలపై 48గంటలు తుఫాను ప్ర
భావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీలంకకు పశ్చిమ దిశలో 850 కిలోమీటర్ల దూరంలో ఓఖీ కేంద్రీకృతమైందని, ఇది ముందుకు వెళ్తుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఆ దేశ వాతావరణ అధికారులు తెలిపారు. 
 
కాగా, చేపలవేటకు వెళ్లి సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన 531 మంది మత్స్యకారులను సహాయసిబ్బంది రక్షించారని, ఇందులో 393 మంది కేరళకు చెందినవారు ఉన్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత తీరప్రాంతాల్లో నౌకాదళం, కోస్ట్‌గార్డులు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్‌చేసి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు. ఓఖీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలితో సహా ఏడు జిల్లాల్లోని పరిస్థితులపై పళనిస్వామి ప్రధానికి వివరించారు. తక్షణ సహాయం అందిస్తామని ప్రధానమంత్రి మోడీ హామీ ఇచ్చారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.