శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:55 IST)

పరువు నష్టం దావా కేసు నితిన్ గడ్కరీకి రూ.10 వేల ఫైన్!

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువు నష్టం దావా కేసులో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి ఢిల్లీ కోర్టు రూ.10 వేల అపరాధం విధించింది. కోర్టు ఖర్చుల కింద ఈ మొత్తాన్ని చెల్లించాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సకాలంలో పాటించకపోవడమే ఇందుకు కారణం. 
 
భారత్‌లోని అత్యంత అవినీతిపరుల జాబితాను ఆమ్‌ ఆద్మీ పార్టీ గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేరును కూడా చేర్చింది. దీంతో ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై నితిన్‌ గడ్కరీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 
 
గతంలో ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజుకు మూడు రోజుల ముందే అఫిడవిట్‌ దాఖలు చేయాలని గడ్కరీని ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యాయవాదికి అందించాలని కూడా ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గడ్కరీ విఫలమై, శనివారమే అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ కోర్టు అపరాధం విధించింది.