బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (15:53 IST)

'జై జవాన్' : దిగొచ్చిన కేంద్రం.. ఒకే ర్యాంకు- ఒకే పింఛను అమలుపై ప్రకటన

భారత మాజీ సైనికులు గత 80 రోజులుగా చేస్తున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ వెల్లడించారు. దేశ రక్షణలో సైనికుల సేవలు అసమానమైనవని మంత్రి కొనియాడారు. ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానం కోసం గత 80 రోజులుగా మాజీ సైనికులంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై కేంద్రం ఎంతమాత్రం స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ పాలన, అభివృద్ధిపై ఆర్ఎస్ఎస్ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష చివరిరోజు సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాజీ సైనికుల ఆందోళనను ప్రధానంగా ప్రస్తావించారు. జై జవాన్ అంటూ నినాదం చేస్తున్న బీజేపీ.. వారి డిమాండ్లను పరిష్కరించలేదా అంటూ ప్రశ్నిస్తూ.. వారి డిమాండ్ మేరకు ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానాన్ని అమలు చేయాలని సూచించారు. దీంతో కేంద్రం దిగివచ్చింది. 
 
దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ శనివారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే ర్యాంకు ఒకే ఫించన్ వ్యవహారం నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం వద్ద నలుగుతోందని గుర్తుచేశారు. సైనికుల జీత భత్యాల కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించామని అన్నారు. ఒకే హోదా ఒకే ఫించన్ పథకం అమలు చేయడం వల్ల 8 వేల కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడుతుందని ఆయన తెలిపారు. ప్రధాని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఖర్చు చేసి ఆ భారం భరించేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. 
 
మేధావులతో చర్చ సందర్భంగా సైనికుల రిటైర్మెంట్ సాధారణ ఉద్యోగుల రిటైర్మింట్ లా ఉండదని, అందరూ ఒకేలా రిటైర్ అవ్వరని, అందుకే ఒకే ర్యాంకు ఒకే ఫించన్ అసాధ్యమని అంతా అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. అయితే దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన సైనికులకు ఆమాత్రం ప్రయోజనం కల్పించడం సరైన నిర్ణయమేనని భావించి కేంద్రం ఒకే ర్యాంకు ఒకే ఫించన్ పథకం అమలు చేస్తుందని మంత్రి మనోహర్ పారీకర్ చెప్పుకొచ్చారు.