శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (15:37 IST)

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి : సుప్రీం ఆదేశం

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగింపుపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. ఢిల్లీలో ఇంకెంతకాలం రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ సభ్యులున్న పార్టీకి రాష్ట్రపతి ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి అభిప్రాయాన్ని కేంద్ర సుప్రీం కోర్టుకు తెలిపింది. 
 
దీంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాని విషయం తెల్సిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 36 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 31, ఆమ్‌ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్‌కు 8, జేడీయూకు ఒక స్థానం లభించింది.
 
సింగల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్‌ మద్దతుతో ఆప్‌ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన 49 రోజుల పాటు సీఎంగా కొనసాగి జనలోక్‌పాల్‌ బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్‌ సహకరించలేదంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో గత ఎనిమిది నెలల నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలంటూ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.