మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 4 ఫిబ్రవరి 2017 (14:30 IST)

పైలట్ అలిగాడు.. విమానం ఆగిపోయింది... వీవీఐపీల పడిగాపులు

బస్టాండుల్లో సమయానికి బస్సు డ్రైవర్ సీటు వద్దకు రాకపోతే ఫలానా నెంబర్ బస్సు డ్రైవర్ గారు ఎక్కడున్నా వెంటనే బస్సువద్దకు రావాలి అంటూ మైకుపెట్టి మరీ అధికారులు ప్రకటన ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. సమయపాల

బస్టాండుల్లో సమయానికి బస్సు డ్రైవర్ సీటు వద్దకు రాకపోతే ఫలానా నెంబర్ బస్సు డ్రైవర్ గారు ఎక్కడున్నా వెంటనే బస్సువద్దకు రావాలి అంటూ మైకుపెట్టి మరీ అధికారులు ప్రకటన ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. సమయపాలన బస్సుకైనా, రైలుకైనా, చివరకు విమానానికైనా ఒకటే కదా. కాని విమానాన్ని నడపాల్సిన పైలటే చివరి నిమిషంలో రాకుండా చెక్కేస్తే.. దూరప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు ఏం చేయాలో, ఎవరిని అడగాలో తెలీకుండా వడిగాపులు కాస్తుంటే.. ఫలానా ప్లైట్ నెంబర్ పైలట్ వెంటనే విమానం వద్దకు రావాలి అని ప్రకటన చేయడానికి అది బస్సు కాదు. విమానం. మరో డ్రైవర్ సులభంగా దొరికినట్లు విమానానికి పైలట్ అదనంగా దొరకటం సాధ్యం కాదు కదా. అందుకే ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఏపీకి రావల్సిన తెలుగు ప్రయాణికులు శుక్రవారం రాత్రి గంటల తరబడి పైలట్ రాడా, విమానం నడపడా, అంటూ వేచి చూస్తూనే ఉన్నారు.
 
విషయానికి వస్తే.. ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానం చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ విమానం ఎక్కి ఏపీ రావాల్సిన తెలుగు ప్రయాణికులు గంటన్నర నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఏమిటా ఆని తీరా తీస్తే ఆఖరి నిమిషంలో పైలెట్ అలిగి విమానం వద్దకు రాకుండా వెళ్లి పోవడంతో ఈ చిక్కు ఏర్పడింది.  మరో పైలెట్ అందుబాటులో లేకపోవడంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. 
 
ఏం చేయాలో తెలియక విమానాశ్రయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారు ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల్లో వీవీఐపీలు కూడా ఉన్నారు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఉన్నారు. పైలెట్ ఎందుకు ఆఖరి నిమిషంలో వెళ్లిపోయాడో, ఏం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.
 
చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే ఆ ఎండని చేప కథ చెప్పడం మొదలెట్టిందట. ఆ విధంగా పైలటూ పైలటూ ఎందుకు రాలేదు అని అడిగితే కథ చెప్పడానికి కూడా ఆ పైలట్ అందుబాటులో లేడు.  ఎందుకు అలిగాడు, ఎందుకు రాలేదు అనేవిషయం విమానాశ్రయ అధికారులకు కూడా తెలీదు. ప్రయాణికులే కాదు వీవీఐపీలు కూడా ఏమీ చేయలేక ఊరకున్నారంటే ఈ సమానత్వమైనా పాటించే వ్యవస్ధ ఎయిర్ ఇండియాకు ఉన్నందుకు అభినందనలు చెప్పాల్సిందే. మేరా భారత్ మహాన్ అని ఈ సందర్భంగానైనా చెప్పాల్సిందే మరి.