శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (02:02 IST)

మన్‌కీ బాత్ సరే.. కామ్ కీ బాత్ ఎక్కడ మోదీజీ: ములాయం కోడలు చెణుకులు

ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లావారిస్ సినిమాలోని మేరే అంగనే మే.. అంటూ మా ఇంట్లో (యూపీలో) మీకేం పని అంటూ మోదీనే అడిగేశారు

లోక్‌సభ సభ్యురాలిగా ఎప్పూడూ ధాటీగా మాట్లాడి ఎరుగని  యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ భార్య, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లావారిస్ సినిమాలోని మేరే అంగనే మే.. అంటూ మా ఇంట్లో (యూపీలో) మీకేం పని అంటూ మోదీనే అడిగేశారు. ఆమె పాట, మోదీని ప్రశ్నించిన తీరు చూసి వందలాది మహిళలు బాబీ, డింపుల్ బాబీ అంటూ ఓ రేంజిలో చప్పట్లు కొట్టారు. 
 
ఎన్నికల ప్రచార సభలలో పాటలు పెట్టడం సర్వసాధారణం. కానీ పెద్ద నాయకులు ఇలాంటి పాటలు పాడటం మాత్రం ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. వాడి వేడిగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి ఈ చిత్రం కనిపించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య, స్వయానా ఎంపీ అయిన డింపుల్ యాదవ్ (39) 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ ఓ పాట పాడారు. అలాగని ఆమె పూర్తిగా పాడలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. 1980లలో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'లావారిస్'లోని పాట మొదటి లైనును ఇందుకోసం ఆమె ఎంచుకున్నారు. 
 
మెరూన్ రంగు చీర కట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకున్న డింపుల్ యాదవ్.. అలహాబాద్‌లో పోటీ చేస్తున్న విద్యార్థి నాయకురాలు రిచా సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు. ఈ మాట అనగానే ఒక్కసారిగా అక్కడున్న వందలాది మంది మహిళలు 'డింపుల్ భాభీ' అంటూ నినదించారు. డింపుల్ యాదవ్ లోక్‌సభలో పెద్దగా మాట్లాడరు, ప్రశ్నలు కూడా పెద్దగా అడిగిన సందర్భాలు లేవు. ఆమె ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే చర్చలలో పాల్గొన్నారు. లోక్‌సభకు ఆమె హాజరు కూడా కేవలం 37 శాతం మాత్రమే. 2014 సంవత్సరంలో మహిళల మీద జరుగుతున్న నేరాలపై మాట్లాడుతుండగా పదే పదే ఇతర సభ్యులు అంతరాయాలు కలిగించడంతో.. కనీసం తాను మాట్లాడుతున్నందుకు తన మామగారు ములాయం సింగ్ యాదవ్ సంతోషిస్తారని చెప్పారు. 
 
అలాంటి డింపుల్.. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రచార సభలో మంచి దూకుడుగా వెళ్తున్నారు. తన భర్త అఖిలేష్ యాదవ్‌తో కలిసి, విడిగా కూడా ప్రచారాలు చేస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి మీదే విమర్శలు చేసే స్థాయికి డింపుల్ వచ్చారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని అన్నారు.