శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (02:25 IST)

వేదనిలయం కుట్రల నిలయం అయిందా. జయ అక్కడే దొరికిపోయిందా?

అక్రమార్కులకు కనువిప్పు కలిగిస్తున్న తీర్పు అది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా నేరస్తులు తప్పించుకో లేరని, విచారణలో కాస్త జాప్యం జరిగినప్పటికీ చేసిన తప్పులకు చట్టంకోరలకు దొరకకుండా ఎవరూ దాక్కోలేరని దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యంత విస్పష్టంగా వెల

అక్రమార్కులకు కనువిప్పు కలిగిస్తున్న తీర్పు అది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా నేరస్తులు తప్పించుకో లేరని, విచారణలో కాస్త జాప్యం జరిగినప్పటికీ చేసిన తప్పులకు చట్టంకోరలకు దొరకకుండా ఎవరూ దాక్కోలేరని దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యంత విస్పష్టంగా వెలువరించిన ఆదేశం అది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు వి.ఎన్‌.సుధాకరన్, జె.ఇళవరసిలు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని మంగళవారం నిర్ధారించిన సుప్రీంకోర్టు దేశ న్యాయచరిత్రలో సరికొత్త ప్రమాణాన్ని, న్యాయంపై ఆశాభావాన్ని కలిగించింది  ఈ కేసులో నిందితులకు నాలుగేళ్లపాటు జైలుశిక్ష, జరిమానాలు విధిస్తూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ కొత్త చరిత్రకు నాంది పలికింది.
 
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసాన్నే అక్రమాల, కుట్రల నిలయంగా మార్చి, తనతో జతకూడిన వారు తోడుగా చట్టానికి ఎలా తూట్లు పొడిచింది అనే విషయాన్ని సుప్రీంకోర్టు విస్పష్టంగా తన తీర్పులో వెలువరించింది. ‘‘జయ పబ్లికేషన్స్‌కు సంబంధించి శశికళకు జయలలిత జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. న్యాయపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకే జయలలిత జీపీఏ ఇచ్చారు. జయ పబ్లికేషన్స్‌లోని తన ఖాతాలను శశికళ నిర్వహించేందుకు వీలుగానే జీపీఏ ఇవ్వడం జరిగింది. నలుగురు నిందితులు కుట్ర పూరితంగా వ్యవహరించారనేందుకు వారు ఏర్పాటు చేసిన కంపెనీలే సాక్ష్యం. పది కంపెనీలు ఒకే రోజు ఏర్పాటు కావడం జరిగింది. ఆ కంపెనీల పేరిట శశికళ, సుధాకరన్‌లు ఆస్తులు కొనడం తప్ప, మరే వ్యాపార లావాదేవీ నిర్వహించలేదు. నమదు ఎంజీఆర్, జయ పబ్లికేషన్స్‌కు కొనసాగింపు గానే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారనేందుకు పక్కా ఆధారాలున్నాయి.
 
ఈ కంపెనీల నిర్వహణ మొత్తం జయలలిత ఇంటి నుంచే జరిగేది. ఈ విషయం జయలలితకు తెలియదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. అలాగే శశికళ తదితరులు కూడా ఆ కంపెనీల వ్యవహారాల గురించి తెలియదనడం సరికాదు. వాస్తవానికి జయలలితతో శశికళ తదితరులకు రక్తసంబంధం లేకపోయినా, వారంతా ఒకే చోట నివసించేవారు. తమకు వేర్వేరు ఆదాయ మార్గాలున్నాయని శశికళ తదితరులు చెబుతున్నప్పటికీ, జయలలిత ఇచ్చిన డబ్బు ద్వారానే వారు కంపెనీలను ఏర్పాటు చేసి, భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. 
 
జయలలిత ఇంటిలోనే అందరూ నివాసం ఉంటూ కుట్ర పన్నారు. జయలలిత తన ఇంట వారికి మానవతా దక్పథంతోనో, మరో కారణంతోనే ఉచిత వసతి కల్పించారు. కాబట్టి వారంతా కలిసే కుట్ర చేశారనేందుకు ఆధారాలున్నాయి. మూలధనం వాటా కింద శశి ఎంటర్‌ప్రైజెస్‌కు జయలలిత కోటి రూపాయలు ఇచ్చిననట్లు జయలలిత ప్రతినిధి ఒకరు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు వెల్లడించారు. ఆ మొత్తాన్ని సెక్యూరిటీగా ఉంచి జయలలిత రుణం పొందారు.
 
కాబట్టి కంపెనీలతో తమకు సంబంధం లేదని జయలలిత ఎంత మాత్రం చెప్పజాలరు. జయలలిత అక్రమ ఆదాయం ద్వారా కంపెనీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టేందుకు జరిగిన కుట్రను ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాల్లోకి జరిగిన నిధుల ప్రవాహం రుజువు చేస్తోంది. అలాగే నిందితుల కుట్రను నార్త్‌ బీచ్‌ సబ్‌ రిజిష్ట్రార్, హార్టీకల్చరల్‌ అధికారి రాధాకష్ణన్‌ ఇచ్చిన సాక్ష్యాలు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేక కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే తీర్పునిచ్చింది. అందువల్ల మేం ఆ తీర్పును సమర్థిస్తున్నాం. ఇక 1992లో జన్మదినం నాడు జయలలితకు అందిన రూ.2.15 కోట్ల విలువైన బహుమతులు, డబ్బును న్యాయమైన ఆదాయంగా భావించలేం. ’’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
 
‘‘జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 34 కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇందులో పది కంపెనీలు ఒక్క రోజే ఏర్పాటయ్యాయి, బ్యాంకు ఖాతాలు కూడా ఒక్క రోజే తెరిచారు. ఇదంతా కూడా యాధృచ్చికమేనని నిందితులు చెప్పడం వాస్తవం దూరం. అత్యధిక కంపెనీల్లో మూలధనం వాటా లేనే లేదు. పలు కంపెనీలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. అయితే ఆ కంపెనీల పేర్ల మీద నిందితులు భారీ ఆస్తులను కూడబెట్టారు. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బును దారి మళ్లించేందుకే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. 
 
కుట్రపూరిత నేరానికే జయలలిత ఇంటిని ఉపయోగించారు. జయలలిత ఖాతా నుంచి నిరాటంకంగా ఇతర ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగింది. అంతేకాక ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ అధికార దుర్వినియోగం జరిగింది. నార్త్‌ బీచ్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ను పోయెస్‌ గార్డెన్‌కు పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను రిజిష్టర్‌ చేయించారు. చాలా ఆస్తులను తక్కువ విలువ చూసి చూపారు. కొనుగోలుదారుల వివరాలు పొందుపరచకుండానే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
 
ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకునే నలుగురు నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాక బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్ల తాలుకు మొత్తాలు, ఇతర నగదు నిల్వలను జరిమానా మొత్తాల కింద జమ చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా సబబైనవే. ఒకవేళ ఆ మొత్తాలు జరిమానాకు సరిపోకుంటే, బంగారు ఆభరణాలను వేలం వేసి ఆ మొత్తాలను జరిమానా నిమిత్తం జమ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ప్రత్యేక కోర్టు చాలా జాగ్రత్తగా, లోతుగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయానికి వచ్చింది. 
 
అయితే హైకోర్టు మాత్రం పలు తప్పులను చేసింది. జయలలిత తదితరులు కేవలం 8.12 శాతం మేర మాత్రమే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని హైకోర్టు చెప్పింది. వాస్తవానికి ఇది ఎంత మాత్రం సరికాదు. తన ముందున్న ఆధారాలను, ఆదాయ వివరాలను లెక్కించడంలో చేసిన పొరపాటు వల్లే హైకోర్టు అటువంటి నిర్ణయానికి వచ్చింది. పబ్లిక్‌ సర్వెంట్‌ అవినీతికి ప్రైవేటు వ్యక్తులు సహకరిస్తే వారిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించచ్చు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరైనవే. అవినీతి నిరోధక చట్టం కింద నిందితులందరూ నేరం చేశారని ప్రత్యేక కోర్టు చెప్పడంలో ఎటువంటి తప్పులేదు.’’అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది.