శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (15:31 IST)

రైలు ప్రమాద మృతులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా!

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు కేంద్రం రూ.25 వేల ఆర్థిక సాయం చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ప్రకటన చేశారు. 
 
ఇదిలావుండగా ఈ ప్రమాదంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గాయపడిన చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరామర్శించారు. 
 
మరోవైపు... మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాద స్థలం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన రైల్వే అధికారులను అడ్డుకుని తీవ్ర నిరసన తెలిపారు. ప్రమాదం స్థలం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై వందలాది మంది ప్రజలు ధర్నాకు దిగడంతో అటూ, ఇటూ ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రమాదస్థలానికి చేరుకున్నారు.