గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:06 IST)

రెస్టారెంట్‌కు రానీయట్లేదన్న రేప్ బాధితురాలు: కాదన్న యాజమాన్యం!

అత్యాచార బాధితురాలిననే కారణంతో కోల్‌కతాలోని రెస్టారెంట్ తనకు అనుమతి నిరాకరించిందని 2012లో నగరంలో నడుస్తున్న కారులో అత్యాచారానికి గురైన ఆంగ్లో-ఇండియన్ మహిళ ఆదివారం ఆరోపించింది. 
 
అయితే ఆమె ఆరోపణలను ఆ రెస్టారెంట్ తోసిపుచ్చింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ‘జింజర్' బార్ అండ్ రెస్టారెంట్ తనకు అనుమతి నిరాకరించిందని ఆ 40 ఏళ్ల మహిళ ఆరోపించింది.
 
‘నేను పార్క్‌స్ట్రీట్ రేప్ బాధితురాలిని కాబట్టి నన్ను అనుమతించలేమని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది. నన్ను లోపలికి అనుమతించవద్దని తమకు ఆదేశాలున్నాయని కూడా వాళ్లు చెప్పారు. అత్యాచారానికి గురవడం నా తప్పా? నేను మామూలు జీవితం గడపకూడదా?' అని ఆమె ప్రశ్నించింది. అయితే ఆమె గొడవ చేసే మనిషి కాబట్టే అనుమతించలేదని రెస్టారెంట్ యాజమాన్యం వాదిస్తోంది.
 
‘రేప్ బాధితురాలు అయినందుకు ఆమెను నిషేధించలేదు. ఆమె ఇంతకు ముందు గొడవ చేసినందుకే అనుమతించలేదు. మద్యం సేవించిన తర్వాత ఆమె ఎలా గొడవ సృష్టించిందో చూపడానికి మా వద్ద వీడియో దృశ్యాలు కూడా ఉన్నాయి. అందుకే ఆమెను అనుమతించలేదు' అని రెస్టారెంట్ యజమాని దీప్తెన్ బెనర్జీ చెప్పారు.
 
ఇద్దరు బిడ్డల తల్లైన ఈ మహిళను 2012 ఫిబ్రవరిలో తుపాకితో బెదిరించి నడుస్తున్న కారులోనే కొందరు అత్యాచారం చేసి అనంతరం బైటికి తోసేసారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పుడు ఈ సంఘటనను కట్టుకథగా అభివర్ణించం వివాదం సృష్టించింది. ఈ సంఘటనలో కోర్టు అయిదుగురిని దోషులుగా పేర్కొన్నప్పటికీ ముగ్గురు మాత్రమే జైల్లో ఉన్నారు. మిగతా ఇద్దరూ ఇంకా పరారీలోనే ఉన్నారు.