గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (18:12 IST)

ఢిల్లీలో ఎబోలా వ్యాధిగ్రస్తుడు... అతడి వీర్యం ద్వారా 3 నెలల తర్వాత కూడా....

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఎబోలా వ్యాధి ఇండియాకు కూడా వచ్చింది. లైబీరియాలో 26 సంవత్సరాల ఓ యువకుడు ఈ వ్యాధి బారిన పడి అక్కడ చికిత్స చేయించుకున్నాడు. అతడికి వ్యాధి తగ్గుముఖం పట్టిందని తిరిగి ఇండియా వచ్చేశాడు కానీ ఇక్కడ ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం అతడిని దేశంలోకి విడిచిపెట్టకుండా పరిశీలనలో ఉంచింది. 
 
ఎందుకంటే... ఎబోలా సోకిన వ్యక్తికి నోరు, లాలాజలం, మూత్ర పరీక్షలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదనీ, వాటిలో వైరస్ ఆనవాళ్లు లేకపోయినా అది శరీరంలో దాగి ఉండే అవకాశం 3 నెలల పాటు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతడిని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చన్నారు. 
 
ఎందుకంటే... వ్యాధికి చికిత్స జరిగిన తర్వాత కూడా అతడు లైంగిక కలయికలో పాల్గొంటే దాని ద్వారా వ్యాధి సంక్రమించే అవకాశముందంటున్నారు. ఇలా 90 రోజుల తర్వాత కూడా జరిగే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అతడిని డిశ్చార్జ్ చేసే ముందు వీర్యం కూడా పరీక్ష చేయాల్సి ఉంటుందన్నారు. 
 
కాగా ఎబోలా వ్యాధి సోకిన సదరు వ్యక్తికి లైబీరియాలో చికిత్స చేశారు. అతడు నవంబరు 10న భారతదేశానికి వచ్చాడు. ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సైతం సమర్పించాడు. ఐతే అతడి శరీరంలో వైరస్ లేదని తమకు నెగటివ్ రిపోర్టులు వచ్చేవరకూ ఇక్కడ నుంచి అతడిని పంపే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.