గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (17:08 IST)

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ శనివారంనాడు షెడ్యూలును ప్రకటిస్తూ... జమ్మూకాశ్మీర్‌లో వరదల కారణంగా ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 87 శాసనసభ స్థానాలతోపాటు జార్ఖండ్‌ రాష్ట్రంలోని 81 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జార్ఖండ్‌లో 24,648 పోలింగ్ కేంద్రాలు, జమ్మూకాశ్మీర్‌లో 10,050 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
 
జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌ రెండు రాష్ట్రాల్లోనూ ఐదు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 25న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 2వ తేదీన రెండో విడత పోలింగ్, డిసెంబర్ 9న మూడో విడత పోలింగ్, డిసెంబర్ 14న నాలుగో విడత పోలింగ్, డిసెంబర్ 20న ఐదో విడత పోలింగ్, డిసెంబర్ 23న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలియజేశారు.