గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (13:47 IST)

మహనీయుడా మళ్లీ పుడతావా..?: బోధన తృష్ణ తీర్చుకుంటూ దివికేగిన స్మైలింగ్ బుద్ధ..!!

భరతజాతి ముద్దుబిడ్డ.. క్షిపణి పితామహుడు ఏపీజే అబ్ధుల్ కలాం కన్నుమూశారు. రాష్ట్రపతిగా జూలై 25, 2002లో ప్రమాణ స్వీకారం చేసిన అబ్దుల్ కలాం, 1997లోనే భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఓ మహర్షిగా తపస్సు చేసిన ఆయన తపస్సు నిలిచిపోయింది. 
 
1981లో పద్మభూషణ్, 1900లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1998లో భారత ప్రభుత్వం నుంచి వీర్ సర్కార్ పురస్కారం స్వీకరించారు. క్షిపణి శాస్త్రవేత్తగా 1980లో క్షిపణి శాస్త్రవేత్తగా తొలి గుర్తింపు లభించింది. వినయం, విధేయత, నిరాడంబరతో మహనీయుడిగా జీవన ప్రస్థానాన్ని కొనసాగించిన అబ్దుల్ కలాం.. అస్తమించారు. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సాయంత్రం 6.30కి ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలారు. హుటాహుటీన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎంత ప్రయత్నించినా కలాం గుండె ఆగిపోయింది. చివరికి క్షిపణి పితామహుడు దివికేగారు. దీంతో యావత్తు భారత దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏడు రోజుల పాటు కేంద్రం సంతాపదినాలు ప్రకటించింది.
 
జీవిత విశేషాలు.. 
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్తగా 11వ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టం పొందారు. 
 
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకపాత్ర పోషించారు. 
 
2002 అధ్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. 
 
బాల్యం ఎలా సాగిందంటే.. 
తమిళ రాష్ట్రంలోని ఓ ముస్లిం కుటుంబంలో అబ్దుల్ కలాం జన్మించారు. తండ్రి జైనుల్బదీన్, పడవ యజమానిగా పనిచేసేవారు. తల్లి ఆశియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటం కోసం కలాం వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు.  
 
పాఠాశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఆయనలో ఉండేది. చదువు కోసం ఎక్కువ సమయం కష్టపడేవారు. బాల్యంలో కలాంకు ఉపాధ్యాయులు ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954లో భౌతికశాస్త్రంలో డిగ్రీ పొందారు. 
 
అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ ఎత్తివేస్తాను అని బెదిరించడంతో కలాం... ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్‌ను ఆకట్టుకున్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయారు. 
 
చెన్నై ఎంఐటీలో చదివిన కలాం 1960లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ డీఆర్‌డీవో ఉద్యోగం చేయడంతోనే సంతృప్తి చెందలేని కలాం.. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 
 
1969లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1963-64లో, NASA యొక్క లాంగ్లే రీసెర్చ్ సెంటర్‌ను(హాంప్టన్ వర్జీనియాలో కలదు), యు గ్రీన్బెల్ట్, మేరీల్యాండ్‌లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, తూర్పు వర్జీనియా తీరాన్ని Wallops ఫ్లైట్ సౌకర్యంతో కలాం సందర్శించారు. 1970-1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్టులు విజయవంతం కావడం గమనార్హం. 
 
రాజా రామన్న కలాంను దేశం యొక్క మొదటి అణు పరీక్ష "Smiling Budha"ను వీక్షించడానికి ఆహ్వానించారు. కలాం ఈ అణు పరీక్ష అభివృద్ధిలో కాని, పరీక్ష సైట్ తయారీలో కానీ, ఆయుధం రూపకల్పనలోకాని పాల్గొనలేదు.
 
1970లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచింది. విజయవంతమైన SLV కార్యక్రమం టెక్నాలజీ ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి కోసం పనిచేశారు. కేంద్ర కేబినెట్ అసమ్మతి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె విచక్షణ అధికారాలు ఉపయోగించి కలామ్ నిర్దేశకత్వంలోని అంతరిక్ష ప్రాజెక్టుల కోసం రహస్యంగా నిధులు కేటాయించారు. 
 
కలాం ఈ క్లాసిఫైడ్ అంతరిక్ష ప్రాజెక్టులు యొక్క నిజమైన స్వభావం కప్పిపుచ్చడానికి యూనియన్ క్యాబినెట్ ఒప్పించటంలో సమగ్ర పాత్ర పోషించారు. కలాం పరిశోధన, నాయకత్వంతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. 1980లలో ప్రభుత్వం కలాం ఆధ్వర్యంలో ఆధునిక క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అప్పటి రక్షణ మంత్రి, ఆర్.వెంకటరామన్ సూచనతో కలాం.. డాక్టర్ విఎస్ అరుణాచలం(రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు మరియు లోహశోధకుడు)తో  కలిసి ఒకేసారి పలు వివిధ క్షిపణి అభివృద్ధికి రూపకల్పన చేశారు. ఆర్ వెంకటరామన్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనే కార్యక్రమం కోసం 388 కోట్లు కేటాయించి, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కలాంను నియమించారు. కలాం, మధ్యంతర శ్రేణి ప్రాక్షేపిక క్షిపణి అగ్ని, వ్యూహాత్మక ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పృధ్వి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు.
 
జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం కీలక పాత్ర పోషించారు. 1998లో, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు, కలిసి కలాం తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం-రాజు స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ అనబడే టాబ్లెట్ PC రూపొందించారు. 
 
ఇలా క్షిపణి పితామహుడి ప్రస్థానం ఊపిరి ఉన్నంత వరకు కొనసాగింది. 84ఏళ్లైనప్పటికీ నవ యువకుడిగా నవతరానికి స్ఫూర్తి నింపే దిశగా ఉపన్యాసాలు చేశారు. కలలను సాకారం చేసేందుకోసం నిత్యం శ్రమించాలని ఉద్భోద చేశారు. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయినప్పటికీ నవతరానికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి.. పనిలోనే విశ్రాంతి వెతుకున్న నిత్య శ్రామికుడిగా దేశ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. హ్యాట్సాఫ్ స్మైలింగ్ బుద్ధ...!!