గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (21:31 IST)

అక్కడ జాతీయ జెండా ఎగరవేస్తున్నారా..? ఎక్కడ?

అక్కడ జాతీయ జెండాలు ఎగరవేస్తున్నారా...? లేదా..? తేల్చి చెప్పండి. అవి కూడా విద్యాసంస్థలే కదా.. జాతీయ జెండా ఎగరవేయాల్సిందే. అంటూ అలహాబాద్ హైకోర్టు మదరసాలపై మరో కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
అన్ని విద్యా సంస్థల్లాగే మదర్సాల్లోనూ జాతీయ పండుగలప్పుడు జెండా ఎగరవేస్తున్నారా? ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇస్తున్నదా? అంటూ అలీగఢ్కు చెందిన అరుణ్ గౌర్ అనే వ్యక్తిని అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ యశ్వంత్ వర్మాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. 
 
మదర్సాలతోపాటు అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలు ఎగిరాయనే నిర్ధారణతోపాటు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.