బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:29 IST)

గజేంద్ర సింగ్ కుటుంబానికి రూ.5లక్షల సాయం: పోలీసుల వెనకడుగు!

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రాజస్థాన్‌ రైతు గజేంద్రసింగ్‌ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ.5 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. గజేంద్ర మరణం తననెంతో బాధించిందని అతడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 
 
ఆద్మీ పార్టీ కార్యకర్తల కారణంగానే రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ను రక్షించలేకపోయామని, వారి ప్రోద్బలంతోనే గజేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ, ఈ విషయంలో ఆప్ ప్రకటించిన మెజిస్టీరియల్ విచారణకు సహకరించబోమని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు.
 
ఇన్ స్పెక్టర్ ఎస్ఎస్ యాదవ్ తయారు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, గజేంద్ర చెట్టు ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతున్న వేళ, ఆ సమాచారం తెలిసినా... వేదికపై ఉన్న ఆప్ నేతలు పట్టించుకోలేదని, చెట్టుపై నుంచి మృతదేహాన్ని దింపేందుకు ఫైరింజన్‌ను తీసుకురావాలని తాము చేసిన ప్రయత్నాలను ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారని వివరించారు. గజేంద్ర మెడకున్న గుడ్డను కార్యకర్తలు తొలగించగా, ఒక్కసారిగా దేహం నేలపై పడిపోయిందని చెప్పారు. మొత్తం ఘటనలో ఆప్ నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు.