గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:30 IST)

కుంభకోణం భయంతో ఫైళ్ళపై సంతకాలు పెట్టడం లేదు : మనోహర్ పారికర్

దేశ రక్షణ శాఖామంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైళ్ళపై సంతకాలు పెట్టేందుకు భయపడుతున్నట్టు చెప్పారు. దీనికి కారణం కుంభకోణాల భయమేనన్నారు. ఫైళ్ళపై సంతకాలు పెట్టక పోవడానికి కుంభకోణాల భయమే కారణమని, మరో ఉద్దేశ్యం లేదని ఆయన వివరించారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 365 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు జరిపిన కుంభకోణాలు తిరిగి ఎక్కడ పునరావృతమవుతాయో అన్న భయాందోళనలు నిర్ణయాల ఆలస్యానికి దారితీస్తున్నాయన్నారు. 
 
"ఏ ఫైలూ కదలలేని స్థితిలో ఉంది. ప్రతి నిర్ణయం వెనుక ప్రతిఫలాలు అందుకోవడం లేదా కుంభకోణం ఉంటుందన్న అభిప్రాయంలో ప్రజలున్నారు. నేను రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 200కు పైగా సిఫార్సు నోట్లు వివిధ లాబీల నుంచి అందుకున్నా" అని ఆయన వివరించారు. పచ్చజెండా ఊపేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు మంత్రి చెప్పారు.