శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:17 IST)

భారత్‌లో బూతు బంద్‌.. లైంగికదాడులు పెరుగుతాయంటూ పోర్న్ లవర్స్ ట్వీట్లు

పోర్న్ సైట్లపై కేంద్రం కొరఢా ఝుళిపించింది. ఈ సైట్లపై నిషేధం విధించకుండా, వాటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ (ఐపీ అడ్రస్‌)ల ఆధారంగా పోర్న్ సైట్లను బ్లాక్ చేసింది. ఈ విధంగా రాత్రికి రాత్రే 4860 సైట్లను బ్లాక్ చేసింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి అనేక ప్రధాన పోర్న్ సైట్లు ఓపెన్ కావడం లేదు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అశ్లీల వెబ్‌సైట్లు, చిత్రాలను అరికట్టడంలో ఇది తొలి చర్యగా కేంద్రం భావిస్తోంది. 
 
వాస్తవానికి అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించే విషయంలో సుప్రీం కోర్టు ఆచితూచి స్పందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం పోర్న్‌సెట్లను నిషేధించడమంటే.. వ్యక్తిగత సేచ్ఛను హరించినట్లే అవుతుందని ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు గోడల ముధ్య ఓ వ్యక్తి రహస్యంగా పోర్నోగ్రఫీ చూస్తేవచ్చే నష్టమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ వెబ్‌సైట్లను చిన్నారులు చూడకుండా, పబ్లిక్‌గా వీక్షించకుండా నిరోధించేందుకు అవసరమైన చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి వెబ్‌సైట్ల నిషేధం జోలికి వెళ్లకుండా సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా కట్టడి చేయాలని నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 32 ఐఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసింది. పోర్న్‌ సైట్స్‌ను బ్లాక్‌ చేయాలని వాటిని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామునుంచే, ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ప్రైవేట్ రంగంలోని యాక్ట్‌, హాత్‌వే, వొడాఫోన్‌, రెడ్‌ జింజర్‌, స్పెక్ట్రానెట్‌, ఆసియానెట్‌ వంటి ఐఎస్పీలు పోర్న్‌ సైట్స్‌ను బ్లాక్‌ చేశాయి. 
 
దీనిపై పోర్న్ లవర్స్ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇది తెలివితక్కువ నిర్ణయం అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనివల్ల హింస, లైంగిక దాడులు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు, ఇది సానుకూల నిర్ణయమని కొందరు స్వాగతిస్తున్నారు. హిందూ సంస్థలను సంతృప్తి పరిచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. పోర్న్ బ్యాన్‌ పేరుతో ట్విట్టర్‌లో ఓ ఖాతానే ప్రారంభించి.. సెటైర్లు వేస్తున్నారు.