శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: చెన్నై , శనివారం, 1 జులై 2017 (03:59 IST)

జీఎస్టీపై ఎవరేమన్నారు? జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు బంద్

శుక్రవారం అర్థరాత్రి తర్వాత ఆరంభమైన జీఎస్టీకి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ వ్యాపారం బంద్ చేసి నిరసనలు తెలిపారు. కానీ జీఎస్టీ స్వర్గాన్ని కిందికి తెస్తుందంటూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థికమంత్రి తదితరులు పార్లమెంటులో ప్రస

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీఎస్టీని పురస్కరించుకొని పార్లమెంట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు, బీజేపీ మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. మరోవైపు జీఎస్టీ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌, వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, ఆప్‌, పలు పార్టీలు హాజరుకాలేదు. శుక్రవారం అర్థరాత్రి తర్వాత  ఆరంభమైన జీఎస్టీకి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ వ్యాపారం బంద్ చేసి నిరసనలు తెలిపారు. కానీ జీఎస్టీ స్వర్గాన్ని కిందికి తెస్తుందంటూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థికమంత్రి తదితరులు పార్లమెంటులో ప్రసంగించడం గమనార్హం. వ్యాపారుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న జీఎస్టీపై ఎవరేమన్నారో చూద్దాం.
 
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి  జీఎస్టీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ జీఎస్టీ భారత దేశ చరిత్రలో కొత్త అధ్యాయమన్నారు. దేశమంతటా ఒకే పన్నుఅమల్లోకి వస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం జీఎస్టీకి పునాది పడిందని చెప్పారు. జీఎస్టీ రూపకల్పనలో తన పాత్ర ఉందని అన్నారు. 2006-07 బడ్జెట్‌ ప్రసంగంలో జీఎస్టీ ప్రతిపాదన చేశామన్నారు. ఇది పన్ను విధానంలో అత్యంత సమగ్రతతో కూడుకున్నదని తెలిపారు. 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ వేశామని గుర్తు చేశారు. జీఎస్టీపై ప్రథమ ముసాయిదా ఇచ్చింది తామేనని చెప్పారు. 2011-12లో స్వయంగా తానే మంత్రుల కమిటీతో చర్చలు జరిపానని వివరించారు. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ కోసం కృషి చేశానని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం జీఎస్టీ కౌన్సిల్‌ ఎంతో శ్రమించిందని ప్రణబ్ అన్నారు.
 
జీఎస్టీతో కొత్త శకం ఆరంభం కానుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సర్వాంగ సుందరంగా జిఎస్టీ ప్రారంభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జిఎస్టీ ఆమోదానికి రెండు సంవత్సరాల 11నెలల 17 రోజులు పట్టిందన్నారు. ఏకాభిప్రాయంతోనే జిఎస్టీ అమలు చేస్తున్నామన్నారు. ఇది అందరి విజయమని మోదీ చెప్పారు. సహకార సమాఖ్య వ్యవస్థకు  జిఎస్టీ ఒక నిదర్శనం అన్నారు. జాతి ఎంచుకున్న మార్గాన్ని సుస్థిరం  చేసుకునేందుకే జీఎస్టీ అమలు చేస్తున్నామన్నారు. జీఎస్టీతో కొత్త శకం ప్రారంభమౌతుందన్నారు. సంస్థానాల  విలీనం కోసం వల్లభాయ్ పటేల్ ఎలా కృషి చేశాడో ఆర్థిక ఏకీకరణ కోసం మేము అదే స్థాయిలో ప్రయత్నిస్తున్నామని తెలిపారు.  చాణుక్య నీతిని మా జిఎస్టీ సంకల్పం చేతల్లో చూపిందన్నారు. వ్యాపారస్థులందరికీ జిఎస్టీ మేలు చేస్తుందన్నారు. పేదల హితం కోసమే జిఎస్టీ అని చెప్పారు. జిఎస్టీతో కొత్త గవర్నెన్స్ వస్తుందన్నారు. 
 
జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించారు. జీఎస్టీతో మన దేశం కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోందని అన్నారు. ఒక దేశం..ఒక పన్ను..ఒక మార్కెట్‌ నినాదంతో జీఎస్టీ అమలు చేస్తున్నామని, కేంద్ర, రాష్ట్రాలు పటిష్టంగా ఉన్నప్పుడే సమష్టి వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రపంచం ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు మనం దైర్యంగా జీఎస్టీని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ గతంలో ఆర్థికమంత్రి హోదాలో... జీఎస్టీ కోసం కృషి చేశారన్నారు. దేశం సాధించిన గొప్ప విజయం జీఎస్టీ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఏకాభిప్రాయంతోనే జీఎస్టీని అమలు చేస్తున్నామన్నారు. ఎన్డీఏ-1 పాలనలో జీఎస్టీ అంశం తెరపైకి వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. విజయ్‌కేల్కర్‌ కమిటీ జీఎస్టీని సిఫార్సు చేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ తదుపరి పక్రియను కొనసాగించిందని, జీఎస్టీ అమలుకు 15 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ఐదు కేంద్ర చట్టాలు, ఒక రాష్ట్ర చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాపారాలు బంద్. వ్యాపారుల బాధ ఏమిటి?
జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు బంద్ అయ్యాయి. పలు చోట్ల వ్యాపారులు షాపులు మూసేశారు. భారీగా ర్యాలీలు నిర్వహించి తమ నిరసన తెలిపారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వస్తు సేవల పన్ను అమలుతో తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వ్యాపారులు ఝాన్సీ ఎక్స్‌ప్రెస్ రైలును కొంతసేపు నిలిపివేశారు. జీఎస్టీకి వ్యతిరేకంగా షాపుల బంద్‌తో పలు రాష్ట్రాల్లోని ప్రధాన వాణిజ్య కూడళ్ళు బోసిపోయాయి.
 
జీఎస్టీ అమలుపై తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల టోల్‌గేట్లు మూసివేశారు. వ్యాపారులు ర్యాలీలు నిర్వహించి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాపారులు, వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతుంటే...మరో భారాన్ని తమపై మోపడంసరికాదని వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ అమలుపై పునరాలోచించాలని కోరుతున్నారు.