బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:50 IST)

రాష్ట్రపతి తిరస్కరించిన యాంటీ టెర్రరిస్టు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం!

రాష్ట్రపతి ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన గుజరాత్ యాంటీ టెర్రరిస్టు బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. పాత బిల్లు పేరు మార్చినప్పటికీ టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడానికి పోలీసులకు అధికారాలు కల్పించడం లాంటి వివాదాస్పద నిబంధనలను మాత్రం అలాగే ఉంచారు. అంతేకాక నేరాన్ని అంగీకరిస్తూ నిందితులు పోలీసుల మందు ఇచ్చిన స్టేట్‌మెంట్లను కోర్టులు అనుమతించడానికి, అలాగే చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు దర్యాప్తును పూర్తి చేయడానికి ఇంతకు ముందు నిర్దేశించిన 90 రోజుల గడువును 180 రోజులకు పొడిగిస్తూ బిల్లులో నిబంధనలను రూపొందించారు.
 
‘గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల అదుపు బిల్లు- 2015’ను మంగళవారం ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ప్రతిఘటన మధ్య మెజారిటీ ఓటుతో ఆమోదించారు. బిల్లులోని వివాదాస్పద నిబంధనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది కూడా. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఈ బిల్లుకు రాష్టప్రతి తన ఆమోదం తెలపలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పాత బిల్లులోని వివాదాస్పద నిబంధనలను అలాగే ఉంచుతూ పేరు మార్పుతో బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 
 
బిల్లును తిరస్కరించే సమయంలో పాత రాష్ట్రపతులు చేసిన సూచనల మేరకు వివాదాస్పద నిబంధనలను తొలగించాలని కాంగ్రెస్ నేతలు శంకర్ సింగ్ వాఘేలా, శశికాంత్ గోహిల్‌లు డిమాండ్ చేసారు. మేధా పాట్కర్ లాంటి సామాజిక ఉద్యమ నేతలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల హక్కులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని మేధా పాట్కర్ అన్నారు. 
 
అయితే ఇప్పుడున్న చట్టాలు, వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి సరిపోవని అంటూ ప్రభుత్వం ఈ నిబంధనలను గట్టిగా సమర్థించుకుంది. అందువల్లనే కఠినమైన, భిన్నమైన నిబంధనలతో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని రాష్ట్రప్రభుత్వం నొక్కి చెబుతోంది.