శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (12:55 IST)

హింసాత్మకంగా మారిన గుజరాత్ బంద్.. హర్దిక్ పటేల్ గృహనిర్బంధం.. ముగ్గురి మృతి

ఓబీసీ రిజర్వేషన్ల కోసం గుజరాత్‌లోని పటేల్ సామాజిక వర్గం బుధవారం ఇచ్చిన సంపూర్ణ బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. ఈ హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ బంద్‌కు ముందు రోజైన మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలకు దిగిన పటేల్ సామాజిక వర్గం అర్థరాత్రి రెచ్చిపోయింది. ప్రభుత్వ ఆస్తులపై విధ్వంసానికి దిగింది. అధికార బీజేపీ నేతల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించింది. 
 
ప్రజా రవాణా వ్యవస్థపై దాడి చేసింది. అనేక బస్సులను ధ్వంసం చేసింది. ఫలితంగా గుజరాత్‌లోని వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాదుతో పాటు సూరత్, మోసానా తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనేక కీలక ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మొహరించారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో మోసానాలో కర్ఫ్యూ విధించారు. 
 
మరోవైపు పటేల్ సామాజిక వర్గాన్ని ముందుండి నడిపిస్తున్న 22 ఏళ్ల యువ సంచలనం హార్దిక్ పటేల్‌ను గుజరాత్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అంతేకాక అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఓసీ కేటగిరీలో ఉన్న ఈ సామాజికవర్గానికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్న విషయం తెల్సిందే.