బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (07:30 IST)

ముష్కరులు భారత్‌లోకి ఎక్కడ చొరబడ్డారు...? ఆ నది వారికి ఎలా కలిసొచ్చింది?

పంజాబ్‌లో మారహోమం సృష్టించిన ముష్కరులు భారత దేశంలోకి ఎలా చొరబడ్డారు? సరిహద్దు భద్రతా దళాలను ఎలా కన్నుగప్పారు..? భారతదేశంలోకి అడుగు పెట్టిన తరువాత వారికి దారి చూపింది ఎవరు? వంటి అనేక అంశాలు ఆశ్చర్యాన్ని కలగిస్తున్నాయి. పాకిస్తాన్ భూభాగంలోంచి ఎలా చొరబడ్డారనే అంశాలపై భారత్ పరిశీలన చేసింది. 
 
ఏడుగురిని బలితీసుకున్న ముగ్గురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. జూలై 26-27లలో ముగ్గురు సాయుధులైన టెర్రరిస్తులు రావి నదిని దాటుకుని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పఠాన్‌కోట్‌లోని బమియాల్ గ్రామం మీదుగా ఆదివారం రాత్రి వారు దేశంలోకి చొరబడినట్లు వెల్లడైంది. 
 
పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటుకుని రావి నదిని దాటి భద్రత పటిష్టంగా లేని బామియాల్ గ్రామంలో ప్రవేశించారని సైనిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అమృత్ సర్-జమ్ము హైవేపై వారు ధీమాగా నడుచుకుంటూ రావటం గమనార్హం. సైనిక దుస్తుల్లో ఉండడం వలన వారిని అనుమానించే అవకాశం లేదు. పంజాబ్ పోలీస్ చీఫ్ సుమేధ్ సింగ్ సైనీ చెప్పిన వివరాల ప్రకారం వారు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ధుస్సీ బంధ్(రావి నది)ని చొరబాటుకు ఎంచుకున్నారు. 
 
సరిహద్దులోకి ప్రవేశించగానే అక్కడి రైల్వే ట్రాక్‌పై బాంబులు అమర్చి దీనానగర్‌కు చేరుకున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తరువాత 15 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు. ఒక జీపీఎస్ పరికరంలో తలవండీ పాయింట్, పర్మానంద్ గ్రామం, దీనానగర్‌లు టార్గెట్లుగా కనిపిస్తే, మరో జీపీఎస్ పరికరం గురుదాస్ పూర్ సివిల్ లైన్స్‌ను టార్గెట్‌గా చూపించింది. ఉగ్రవాదుల నుంచి మొత్తం 11 ఉపయోగించని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనానగర్ పట్టణంలోనికి ఉగ్రవాదులు ప్రవేశించటానికి ముందు తారాగఢ్‌లో ఓ దుకాణదారు తన దుకాణంపై ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజిలోనూ ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. 14 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తెల్లవారుఝామున 4:55గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా రికార్డయింది. వీటన్నింటిని గమనిస్తే ఉగ్రవాదులు దేశంలో భద్రత బలహీనంగా ఉన్న ప్రాంతాలను చొరబాట్లకు ఆసరాగా చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.