మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (07:17 IST)

గురుదాస్‌పూర్ హీరో.. ఉగ్రవాదులనే హడలెత్తించాడు. 75 మంది ప్రాణాలు కాపాడాడు.

బస్సు నిండా ప్రయాణీకులే..  75 మందితో బస్సు కిటకిటలాడుతోంది. ఎదురుగా నలుగురు ఉగ్రవాదులు! ఏకే 47లతో బస్సుపైకి కాల్పులు జరుపుతున్నారు. ఆ డ్రైవర్‌ ఆ కాల్పులను ఏమాత్రం లెక్క చేయలేదు. అతని మెదడు చాలా షార్ప్‌గా పని చేసింది. . నిలిపినా చంపుతారు.. నిలపకపోయినా కాల్పులు జరుపుతారు. ఇంత మంది ప్రాణాలు తన చేతిలో ఉంటే వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అంతే బస్సును ఉన్న దానికంటే రెట్టింపు వేగంతో ముందుకు నడిపించాడు డ్రైవర్ నానక్‌చంద్‌. ఆ వేగం చూసి ఉగ్రవాదులే పక్కకు తప్పుకున్నారు. ఈ సంఘటన మరెక్కడిదో కాదు సోమవారం పంజాబ్‌లో జరిగిందే.
 
డ్రైవర్ నానక్‌చంద్‌ సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా ఇంత ఘోరం తప్పిపోయింది. సోమవారం తెల్లవారుజామున దీనా నగర్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు..బస్టాండ్‌ సమీపంలోనే ఓ ఆర్టీసీ బస్సుపై కాల్పులు జరిపారు. నేరుగా ప్రయాణికులపైకే గురిపెట్టారు. ఆ సమయంలో బస్సులో సుమారు 75 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
కాల్పులు జరిపినప్పటికీ డ్రైవర్‌ నానక్‌ చంద్‌ అదరలేదు. బెదరలేదు. పైగా... ఉగ్రవాదులను బెదరగొడుతూ వారి వైపుగా బస్సును వేగంగా నడిపారు. దీంతో టెర్రరిస్టులు అడుగు వెనక్కి వేయక తప్పలేదు. ఆ తర్వాత నానక్‌చంద్‌ బస్సును నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఆపారు. ఈలోపు పోలీసులకు కూడా ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెరసి... నానక్‌ చంద్‌ సాహసంతో భారీ ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.