శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:36 IST)

వరుడి చెంప పగులగొట్టిన మాజీ ప్రేయసి.. తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సిన వరుడుని పట్టుకుని ఓ యువతి చెంప పగులగొట్టింది. దీంతో ఖిన్నులైన వరుడి బంధువులు ఆ యువతిని నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వధువు.. వరుడి సోదరుని వివాహం చేసుకుంది. 
 
హరిద్వార్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... హరిద్వార్ సమీపంలోని అవడిపుర్హాల్ గ్రామంలో జరుగుతున్న వివాహ మండపంలో ఒక యువతి బాంబులా దూసుకొచ్చింది. వరుడిని పట్టుకుని చెంపలు వాయించింది. చుట్టుపక్కలవారు ఆమెను పక్కకు తోసి విషయం అడుగగా, వరుడికి తాను మాజీ గర్ల్ ఫ్రెండ్‌నని, ఎన్నో సంవత్సరాల నుంచి తామిద్దరికీ సంబంధం ఉందని చెప్పింది. ఈ పెళ్లి చేసుకుంటే అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించింది. 
 
దీంతో పెళ్లి కుమార్తె అడ్డం తిరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పెళ్లి చేసుకునేది లేదని వధువు భీష్మించుకు కూర్చుంది. ఆమె బాధను చూసిన బంధువులు, వరుడి తరపువారిని వెళ్లిపోవాలని కోరారు. మాటా మాటా పెరుగగా, పోలీసు స్టేషనుకు వెళ్లాలని అనుకున్న ఇరు వర్గాలు, చివరికి పంచాయితీని ఆశ్రయించాయి. 
 
వరుడి తరపు వారు తమను క్షమించాలని పంచాయితీలో కోరారు. కేసుల దాకా పోకుండా మధ్యేమార్గంగా వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని వధువుకు సూచించారు. ఈ సూచనకు వధువుతో పాటు కాబోయిన వరుడి తమ్ముడు కూడా అంగీకరించడంతో పెళ్లి తతంగం పూర్తయింది.