శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (08:51 IST)

హర్యానా సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ : నేడు ప్రమాణ స్వీకారం?

హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపికయ్యారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 యేళ్ళ ఖట్టర్ ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త్‌గా పని చేశారు. ఖట్టర్‌ను హర్యానా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అధికారికంగా ప్రకటించారు. 
 
కాగా, 40 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పని చేసిన ఆయన 20 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్రమోదీకి మంచి స్నేహితుడు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఖట్టర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మంగళవారం చండీగఢ్‌లో సమావేశం అయిన హర్యానా బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఖట్టర్‌ను తన నాయకుడుగా ఎన్నుకుంది. 
 
హర్యానా కొత్త సీఎం ఎంపిక కోసం పరిశీలకుడుగా కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం వెళ్లగా, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, రామ్‌ విలాస్‌ శర్మ, ధన్‌కర్‌, కెప్టెన్‌ అభిమన్యు తదితరులు పోటీపడ్డారు. అయితే పదవి మాత్రం ఖట్టర్‌నే వరించింది. ఖట్టర్‌ కర్నాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 
 
గత 15 యేళ్లుగా జాట్‌లే హర్యానా సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ జాట్‌యేతర అభ్యర్థి అయిన ఖట్టర్‌ను హర్యానా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ విధంగా జాట్‌యేతరులను సంతృప్తి పరచవచ్చుననే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.