శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:20 IST)

ప్రియాంక గాంధీకి హెచ్‌పీ హైకోర్టు నోటీసులు.. మీ భూమి వివరాలు ఎందుకు వెల్లడించరాదు?

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నోటీసు జారీ చేసింది. సిమ్లాలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన వివరాలను ఎందుకు బహిర్గతం చేయరాదో వెల్లడించకూడదో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు సిమ్లాలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య దరఖాస్తు చేశారు. ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సిందేనన్న రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సమాచార కమిషన్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ పరిస్థితుల్లో కేసు విచారణ శుక్రవారం జరిగింది. దీన్ని విచారించిన హైకోర్టు ప్రియాంకా గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు భూమికి సంబంధించిన వివరాలు ఎందుకు వెల్లడి చేయరాదో తెలపాలంటూ ఆ నోటీసుల్లో కోర్టు ప్రియాంకా గాంధీని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.