బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (11:27 IST)

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. హైదరాబాద్‌లో కనిపించని రంగుల పండుగ

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అమితానందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అమితానందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు దేశప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇకపోతే, హైదరాబాద్ నగర వీధుల్లో మాత్రం ఈ పండుగ సందడి కనిపించడం లేదు. సాధారణంగా హోలీ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరంలో కనిపించే సందడి అంతాఇంతాకాదు. వీధులన్నీ రంగు నీళ్లతో నిండిపోతాయి. కానీ ఈ సంవత్సరం హోలీ పండగకు రెండు రోజుల సెలవు ఇచ్చినప్పటికీ సందడి కనిపించడం లేదు. హోలీ వేళ బోసిపోయే ప్రధాన రహదార్లు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి. 
 
దీనికి కారణాలను విశ్లేషిస్తే, శుక్రవారం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు. దీంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పొద్దునే స్కూళ్లకు వెళ్లిపోయారు. పైగా శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉండటంతో చాలా మంది తల్లిదండ్రులు, టీనేజ్ విద్యార్థులు పరీక్షల హడావుడిలో, పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటం కూడా హోలీ హడావుడిని తగ్గించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు మినహా ప్రైవేట్ సంస్థలన్నీ పనిచేస్తుండటం, బ్యాంకులు సైతం నిన్ననే సెలవు తీసుకుని నేడు తెరచి ఉండటంతో హోలీ సందడి నామమాత్రంగానే కనిపిస్తోంది.